Swapna Choudary: బిగ్ బాస్ సీజన్-7లో చాన్స్ అంటూ నటి స్వప్నా చౌదరికి టోకరా
- బిగ్ బాస్ షో పేరిట రూ.2.50 లక్షలు వసూలు
- అవకాశం రాకపోగా, డబ్బులు తిరిగి ఇవ్వని కేటుగాళ్లు
- జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన స్వప్నా చౌదరి
తెలుగు బుల్లితెరపై అత్యంత విజయవంతమైన రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటివరకు ఏడు సీజన్లు జయప్రదంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షోలో పాల్గొనేందుకు ఎంతోమంది ఉవ్విళ్లూరుతుంటారు. సరిగ్గా, ఈ అంశమే మోసగాళ్లకు ఊతమిస్తోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్-7లో అవకాశం ఇప్పిస్తానంటూ తన నుంచి లక్షలు వసూలు చేశారని ప్రముఖ యాంకర్, నటి స్వప్నా చౌదరి జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తాను ఎలా మోసపోయిందీ స్వప్నా చౌదరి మీడియాకు వివరించారు.
"నేను యాంకర్ గా, సినీ నటిగా సొంతంగానే ఎదిగాను. బిగ్ బాస్ షోలో కూడా కనపడి అందరికీ సర్ ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నాను. ఈ క్రమంలో మొదట సత్య అనే వ్యక్తిని కలిశాను. సత్య నాకు తమ్మలి రాజు అనే వ్యక్తిని పరిచయం చేశాడు. అనంతరం వారు... మీ ప్రొఫైల్ బాగుంది, ఆల్రెడీ మీ ప్రొఫైల్ ను బిగ్ బాస్ నిర్వాహకులకు పంపించాము, ఒక ఐదు లక్షలు రెడీ చేసుకోండి అని చెప్పారు.
నాకు అనుమానం వచ్చి, ఐదు లక్షలు ఎందుకు అని ప్రశ్నించాను. బిగ్ బాస్ షోకి వెళుతున్నారు కాబట్టి మీకు పబ్లిక్ రిలేషన్స్ (పీఆర్), కాస్టూమ్స్ అవసరం అవుతాయి అని చెప్పారు. దాంతో నేను, పీఆర్ కావాలనుకుంటే మా ఫ్రెండ్ తల్లాడ సాయికృష్ణ ఉన్నాడని చెప్పాను.
బయటి వ్యక్తిని పీఆర్ గా పెట్టుకుంటే వాళ్లు సినిమాలతో బిజీగా ఉండి, బిగ్ బాస్ షోపై శ్రద్ధ చూపించకపోవచ్చు అని సత్య, తమ్మలి రాజు పేర్కొన్నారు. బిగ్ బాస్ షో కోసం ప్రత్యేకంగా ఓ పీఆర్ ఉంటే మంచిదని అన్నారు. సోమవారం నుంచి శనివారం వరకు మీ కాస్ట్యూమ్స్ ఉంటాయి... వీకెండ్ లో నాగార్జున గారు వస్తారు కాబట్టి స్పెషల్ కాస్ట్యూమ్స్ ఉండాలి అని వారు వివరించారు. దీని కోసమే మేం డబ్బు అడుగుతున్నాం అని చెప్పారు.
దాంతో నేను వారికి మొదట రూ.2.50 లక్షలు ఇచ్చాను. గతంలో బిగ్ బాస్ షోలో పాల్గొన్న ఇనాయా సుల్తానా, సూర్య, సత్యశ్రీలను తానే పంపించానని రాజు చెప్పాడు. సీజన్-7లో బోలే షావలీని పంపించింది కూడా తానే అని చెప్పాడు. నాకు సత్యతో ఒక ఏడాది నుంచి పరిచయం ఉంది. మేం ఈవెంట్ల గురించి మాట్లాడుకునేవాళ్లం. సత్యను నమ్మాను కాబట్టి, అతడు పరిచయం చేసిన తమ్మలి రాజును కూడా నమ్మాను.
ఒకవేళ బిగ్ బాస్ చాన్స్ రాకపోతే నీ డబ్బు నీకు తిరిగిచ్చేస్తాము అని వారు నమ్మకంగా చెప్పారు. దాంతో వాళ్లను నమ్మి మోసపోయాను" అని వివరించింది.
కాగా, సత్య, తమ్మలి రాజు ఇద్దరూ మాటీవీలో ఉద్యోగులు కాగా... వారిని మాటీవీ యాజమాన్యం ఉద్యోగాల నుంచి తొలగించినట్టు తెలుస్తోంది.