AP CEO: ఓటర్ల తుది జాబితా-2024పై రాజకీయ పార్టీలతో ఏపీ సీఈవో భేటీ
- నేడు ఓటర్ల తుది జాబితా విడుదల
- సీఈవోతో సమావేశానికి టీడీపీ తరఫున వర్ల రామయ్య హాజరు
- వైసీపీ నుంచి లేళ్ల అప్పిరెడ్డి హాజరు
- ఓటరు తుది జాబితాలో కూడా అవకతవకలు ఉన్నాయన్న వర్ల
ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం ఏపీకి సంబంధించిన ఓటర్ల తుది జాబితా-2024ని విడుదల చేసింది. దీనిపై ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి అధికార వైసీపీ తరఫున లేళ్ల అప్పిరెడ్డి, విపక్ష టీడీపీ తరఫున వర్ల రామయ్య హాజరయ్యారు. సీఈవోతో సమావేశంలో సీపీఎం, సీపీఐ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
వర్ల రామయ్య మాట్లాడుతూ, ఓటర్ల తుది జాబితాలో ఇంకా అవకతవకలు ఉన్నాయని అన్నారు. గిరీషా వంటి కలెక్టర్ల మీదే కాదు, తప్పుచేసిన కొందరు ఐఏఎస్, ఐపీఎస్ ల మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ చేసిన ఎమ్మెల్యేల బదిలీల వల్ల ఓటర్ల జాబితాలో అక్రమాలకు తెరలేపే అవకాశం కనిపిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మంత్రి విడదల రజని చిలకలూరిపేట ఓటర్లను గుంటూరు వెస్ట్ కు మార్పు చేస్తున్నారని వర్ల రామయ్య ఆరోపించారు. మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే వెల్లంపల్లి తమ నియోజకవర్గ ఓటర్లను తమకు టికెట్ కేటాయించిన నియోజకవర్గానికి మార్చుతున్నారని వివరించారు. ఇలాంటి తప్పిదాలకు పాల్పడితే గిరీషా తరహాలోనే చర్యలు తప్పవని హెచ్చరించారు.