Anganwadi: ప్రభుత్వం అంగన్వాడీల పట్ల దుర్మార్గంగా వ్యవహరించింది: అంగన్వాడీ నాయకురాలు బేబీ రాణి

Anganwadi leader Baby Rani fires on state govt

  • అంగన్వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగం
  • ఎస్మా గడువు ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలు
  • విధుల్లో చేరని అంగన్వాడీల తొలగింపు
  • డిమాండ్లు సాధించేవరకు పోరాటం ఆపబోమన్న అంగన్వాడీ నేత

డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం, ఎస్మా గడువు ముగిసిన నేపథ్యంలో, విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగిస్తున్నట్టు ప్రకటించడం తెలిసిందే. అంగన్వాడీలు ఛలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వగా, విజయవాడలో వారి దీక్షను గత అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు. ఈ పరిణామాలపై అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబీరాణి స్పందించారు. 

ప్రభుత్వం అంగన్వాడీల పట్ల దుర్మార్గంగా వ్యవహరించిందని అన్నారు. దీక్షలో కూర్చున్న అంగన్వాడీలను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలని కూడా చూడకుండా రోడ్డుపై ఈడ్చి పారేశారని ఆరోపించారు. ఛలో విజయవాడ కార్యాచరణలో భాగంగా, కోటి సంతకాలు సేకరించి సీఎంకు అందించాలని భావించామని, కానీ సీఎంను కలిసే అవకాశం లేకుండా అడ్డుకోవడం సిగ్గుచేటు అని బేబీరాణి విమర్శించారు. 

అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. ఎన్ని అరెస్టులు చేసినా అంగన్వాడీల పోరాటం కొనసాగుతుందని అన్నారు. దీక్ష భగ్నం చేసి పోలీస్ స్టేషన్లకు తరలించినప్పటికీ, అంగన్వాడీలు ఉద్యమం కొనసాగించారని ఆమె వెల్లడించారు. మళ్లీ విజయవాడ వచ్చి ఉద్యమం కొనసాగిస్తామని బేబీరాణి ప్రకటించారు. 

ఉద్యమాన్ని అణచివేయాలన్న ఉద్దేశంతో అంగన్వాడీలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అంగన్వాడీలను తొలగించి, కొత్తవారిని నియమించినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హక్కులు సాధించుకునేంత వరకు తమ పోరాటం ఆగదని అన్నారు.

More Telugu News