Rama devotee: అయోధ్యలో రామభక్తుడికి గుండెపోటు.. ప్రాణాలు కాపాడిన వైమానిక దళం బృందం

Rama devotee had a heart attack in Ayodhya and Indian Air force saved his life

  • ప్రాణప్రతిష్ఠ వేడుకలో గుండెపోటుకు గురైన ఓ రామభక్తుడికి సత్వర చికిత్స అందించిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బృందం
  • ఎయిర్‌ఫోర్స్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ సకాలంలో స్పందించడంతో నిలిచిన ప్రాణాలు
  • ఒక ప్రకటనలో వెల్లడించిన భారత వైమానిక దళం

అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ వేళ ఆలయ సముదాయంలో గుండెపోటుకు గురైన ఓ రామభక్తుడి ప్రాణాలను భారత వైమానిక దళం సిబ్బంది కాపాడారు. ఎయిర్‌ఫోర్స్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ సకాలంలో స్పందించి వైద్యం అందించడంతో రామకృష్ణ శ్రీవాస్తవ (65) అనే భక్తుడి ప్రాణాలు దక్కాయి. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన శ్రీవాస్తవ గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలాడు. 

ఈ విషయాన్ని గమనించిన వింగ్ కమాండర్ మనీష్ గుప్తా నేతృత్వంలోని భీష్మ్ క్యూబ్ బృందం తక్షణమే స్పందించి బాధితుడిని అక్కడే ఉన్న మొబైల్ ఆసుపత్రికి తరలించింది. అత్యంత కీలకమైన ‘గోల్డెన్ అవర్’లో తీసుకెళ్లడంతో బాధితుడి ప్రాణాలను వైద్యులు కాపాడారు. ఒక గంట తర్వాత మెరుగైన వైద్యం కోసం అతడిని మరో ఆసుపత్రికి తరలించారు. అత్యంత కీలకమైన సమయంలో హాస్పిటల్‌కు తరలించడంతో రామకృష్ణ శ్రీవాస్తవ ప్రాణాలు నిలిచాయని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఒక ప్రకటనలో పేర్కొంది.

కాగా గుండెపోటుకు గురైన సమయంలో శ్రీవాస్తవ బీపీ 210/170 ప్రమాదకర స్థాయికి చేరిందని, వెంటనే ర్యాపిడ్ రెస్పాన్స్ టీం అతడికి ప్రాథమిక చికిత్స అందించిందని, రోగి పరిస్థితి నిలకడగా మారిన తర్వాత మెరుగైన చికిత్స కోసం సివిల్ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపింది. కాగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు వీలుగా 2 క్యూబ్-భీష్మ్ మొబైల్ ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. మెడికల్ ఎమర్జెన్సీ, వైద్య సంసిద్ధత కోసం ఈ బృందాలను ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News