Nara Lokesh: పిచ్చి పాలకుడు అంగన్వాడీ చెల్లెమ్మలపై ప్రతాపం చూపిస్తున్నాడు: నారా లోకేశ్

Nara Lokesh condemns AP govt revoking Anganwadi workers

  • అంగన్వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగించిన ప్రభుత్వం
  • ఎస్మా గడువు ముగియడంతో అంగన్వాడీల తొలగింపు
  • జగన్ కు మతిభ్రమించిందన్న లోకేశ్
  • తాను వదిలిన బాణం తనవైపే వస్తుండడంతో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడని ఎద్దేవా

అంగన్వాడీల సమ్మెపై ప్రయోగించిన ఎస్మా చట్టం గడువు ముగియడంతో ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. అంగన్వాడీలను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. 

అంగన్వాడీ చెల్లెమ్మలపై పిచ్చిపాలకుడు ప్రతాపం చూపిస్తున్నాడని విమర్శించారు. ఒకవైపు, తాను వదిలిన బాణం తిరిగి తనవైపే దూసుకు రావడం... మరోవైపు, సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో జగన్ కు మతిభ్రమించిందని, విచక్షణ కోల్పోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని ఎద్దేవా చేశారు. 

"జగన్ అరాచక పాలనకు అంతిమ ఘడియలు సమీపిస్తున్న వేళ ఫ్రస్ట్రేషన్ తో ఆయన పిచ్చి పీక్ స్టేజికి చేరింది. పిచ్చివాడి చేతిలో రాయి అటు, ఇటు తిరిగి... తమ న్యాయమైన డిమాండ్ల కోసం 42 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్ వాడీల వైపు మళ్లింది. అంగన్వాడీలను ఉద్యోగాల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం నియంతృత్వ పోకడలకు అద్దం పడుతోంది. 

తాటాకు చప్పుళ్లకు లొంగని అంగన్వాడీలు 'ఛలో విజయవాడ'కు పిలుపునివ్వడంతో తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనలు చెలరేగుతున్నాయి. ప్రభుత్వం అంగన్వాడీల విషయంలో తప్పు చేయకపోతే ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే మార్గంలో టన్నుల కొద్దీ ఐరన్ ఫెన్సింగులు, వందలాది అదనపు బలగాలను దించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? 

తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎటువంటి బెదిరింపులకు లొంగకుండా అంగన్వాడీలు  ఉక్కు సంకల్పంతో చేస్తున్న ఆందోళనకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా సంఘీభావం తెలియజేస్తోంది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అంగన్వాడీల ఆగ్రహ జ్వాలలే అరాచక ప్రభుత్వానికి చితిమంటలు కాబోతున్నాయి. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం మూర్ఖపు చర్యలను విడనాడి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపాలి. 

జగన్ ప్రభుత్వం తొలగించే అంగన్వాడీలను, టీడీపీ-జనసేన ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎటువంటి సర్వీసు అంతరాయం లేకుండా తిరిగి ఉద్యోగాల్లో నియమిస్తామని హామీ ఇస్తున్నాను" అంటూ నారా లోకేశ్ ఓ ప్రకటన చేశారు.

Nara Lokesh
Anganwadi Workers
Jagan
TDP
YSRCP
Janasena
Andhra Pradesh
  • Loading...

More Telugu News