Mallu Bhatti Vikramarka: ఇదేం నీచబుద్ధి?: విద్యుత్ బిల్లులు కట్టవద్దన్న కేటీఆర్‌పై మల్లు భట్టి ఆగ్రహం
- జనవరి నుంచి విద్యుత్ బిల్లులు కట్టవద్దన్న కేటీఆర్
- ఈ వ్యాఖ్యల ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించిన మల్లు భట్టి
- రాష్ట్రం అంధకారంలో ఉండాలని కోరుకుంటున్నారా? అని ప్రశ్న
జనవరి నుంచి విద్యుత్ బిల్లులు కట్టవద్దన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. ప్రజలు విద్యుత్ బిల్లులు కట్టవద్దంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల ఉద్దేశ్యం ఏమిటి? అని ప్రశ్నించారు. నీచబుద్ధి ఉన్న వారే ఇలాంటి ప్రకటనలు చేస్తారని విమర్శించారు. రాష్ట్రం మొత్తం అంధకారంలో ఉండాలని కోరుకుంటున్నారా? లేదంటే విద్యుత్ శాఖను అప్పుల పాలు చేయాలని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా? అని నిప్పులు చెరిగారు.
సచివాలయంలో సమీక్ష
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ కోసం పౌర సరఫరాల శాఖ రూపొందించిన ప్రతిపాదనలపై మల్లు భట్టి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పౌరసరఫరాల శాఖ బడ్జెట్ ప్రిపరేషన్‌పై చర్చ జరిగిందన్నారు. పేదవారికి బియ్యం అందించే ఈ శాఖను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. అంతకుముందు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లించే వారన్నారు. 2016-17 నుంచి పౌర సరఫరాల శాఖకు వరుసగా వేల కోట్ల రూపాయల భారం పడిందన్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం రూ.58,860 కోట్లుగా ఉందన్నారు.
పాత బకాయిలు తీర్చడం కోసం... రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి గత ప్రభుత్వం మళ్లీ అప్పు తీసుకుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పౌరసరఫరాల శాఖపై పెద్ద ఎత్తున భారం పడిందన్నారు. బ్యాంకు గ్యారెంటీ ఇస్తే తప్ప రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. బీఆర్ఎస్ చేతిలో ధనిక రాష్ట్రాన్ని పెడితే ఆగం చేశారని ఆరోపించారు. కోరి తెచ్చుకున్న తెలంగాణను అప్పుల పాలు చేశారని... కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం కోసం కృషి చేస్తోందన్నారు.