Revanth Reddy: మూసీనదిని థేమ్స్ నదిలా స్వచ్ఛంగా మారుస్తాం: లండన్‌లో రేవంత్ రెడ్డి

Revanth Reddy speech in London

  • ప్రపంచ దేశాలతో పోటీ పడి తెలంగాణను అభివృద్ధి చేస్తామన్న రేవంత్ రెడ్డి
  • మూసీ నదిని జలధారగా మార్చుతామని హామీ
  • బీఆర్ఎస్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేసిన ముఖ్యమంత్రి

36 నెలల్లో మూసీని థేమ్స్ నదిలా స్వచ్ఛంగా మారుస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. లండన్ వేదికగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అక్కడ రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ... ప్రపంచ దేశాలతో పోటీ పడి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. మూసీ నదిని సజీవ జలధారగా మార్చుతామని హామీ ఇచ్చారు. తెలంగాణలో జరుగుతోన్న కార్యక్రమాలను ముఖ్యమంత్రి వివరించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.

తాను తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పరిపాలనపై దృష్టి సారించానని.. సముచిత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. అధికారుల సహకారంతో దావోస్ వేదికగా కోట్లాది రూపాయల పెట్టుబడులు తీసుకు వచ్చినట్లు చెప్పారు. తాము రాష్ట్ర అభవృద్ధే లక్ష్యంగా సాగుతున్నామన్నారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీని, రాజీవ్ గాంధీని, నందమూరి తారక రామారావును, వైఎస్ రాజశేఖరెడ్డి తదితరులను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ పేరు చెప్పినప్పుడు ప్రవాస భారతీయులు చాలాసేపు నినాదాలు చేసి, హర్షం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు

కొంతమంది కుటుంబం కోసం రాష్ట్రాన్ని పణంగా పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించవద్దనే విధంగా కొంతమంది తీరు ఉందన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు రూ.72 వేల కోట్ల అప్పు ఉండగా... గత పదేళ్ల బీఆర్ఎస్ కుటుంబ పాలనలో అది రూ.7 లక్షల కోట్లకు పెరిగిందని ఆరోపించారు. తెలంగాణ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినప్పటికీ.. ఉద్యోగులకు వేతనాలు సమయానికి ఇచ్చామన్నారు. ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కలు విరగ్గొట్టినా వారికి బుద్ధి రాలేదని.. మొన్ననే వచ్చిన తమ ప్రభుత్వాన్ని ఆరు గ్యారెంటీల గురించి అడుగుతున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీని వంద మీటర్ల లోతున పాతి పెడతామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News