Rashmika Mandanna: రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోను తయారు చేసిన వ్యక్తి అరెస్ట్
- దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన రష్మిక వీడియో
- జరా పటేల్ వీడియోను రష్మిక వీడియోగా మార్ఫింగ్ చేసిన దుండగుడు
- అలియా భట్, కాజోల్, కత్రినా కూడా డీప్ ఫేక్ బాధితులే
సినీ నటి రష్మిక డీప్ ఫేక్ వీడియో దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాను ఒక ఊపు ఊపింది. ఈ డీప్ ఫేక్ వీడియోను తయారు చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వాస్తవానికి ఒరిజినల్ వీడియో బ్రిటీష్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్ జరా పటేల్ కు చెందినది. ఈ వీడియోను డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి రష్మిక వీడియోగా మార్ఫింగ్ చేశారు.
రష్మిక డీప్ ఫేక్ వీడియో వైరల్ కావడంతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 465, 469, ఐటీ సెక్షన్లు 66సీ, 66ఈ ల కింద అభియోగాలు మోపారు. మరోవైపు కాజోల్, కత్రినా కైఫ్, అలియా భట్, సచిన్ టెండూల్కర్ డీప్ ఫేక్ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. తాజాగా సోనూసూద్ వీడియో ఈరోజు నెట్టింట ప్రత్యక్షమయింది.
డీప్ ఫేక్ వీడియోల పట్ల దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వీడియోలు తయారు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ... ఐటీ చట్టంలో కఠిన మార్పులు తీసుకొస్తామని చెప్పారు.