Super Over: మొన్నటి మ్యాచ్‌లో రెండో సూపర్ ఓవర్ కూడా టై అయి ఉంటే ఏం జరిగి ఉండేదో తెలుసా?

Complete rules of Super Over what ICC says

  • 2019 వన్డే ప్రపంచకప్‌లో బౌండరీలు ఎక్కువ బాదిన ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించడంపై విమర్శలు
  • ఆ తర్వాత రూల్స్ మార్చిన ఐసీసీ
  • ఫలితం తేలే వరకు సూపర్ ఓవర్లు ఆడుతూనే ఉండాలన్నది కొత్త రూల్

భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య బుధవారం జరిగిన చివరిదైన మూడో టీ20లో భారత్ నాటకీయ విజయం సాధించింది. తొలుత మ్యాచ్ టైగా ముగియడంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. అందులోనూ స్కోర్లు సమం కావడంతో రెండో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. అయితే, ఈసారి మాత్రం భారత జట్టు పట్టు వదల్లేదు. విజయం సాధించి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుని ప్రత్యర్థిని వైట్‌వాష్ చేసింది.

రెండో సూపర్ ఓవర్‌లో భారత జట్టు విజయం సాధించింది కాబట్టి సరిపోయింది. ఆ ఓవర్ కూడా టై అయితే ఏంటన్న ప్రశ్న అభిమానుల మదిని తొలిచేస్తోంది. ఇదే చిక్కు ప్రశ్న 2019 వన్డే ప్రపంచకప్‌లోనూ తలెత్తింది. అయితే, అప్పుడు రెండుసార్లు ఇలా జరగడంతో మూడోసారి బౌండరీలు ఎక్కువ బాదిన జట్టును విజేతగా ప్రకటించారు. ఇది విమర్శలకు తావివ్వడంతో ఆ తర్వాత ఐసీసీ ఈ నిబంధనను మార్చేసింది. 

ఐసీసీ కొత్త రూల్ ఇదే
ఐసీసీ తాజా నిబంధన ప్రకారం.. రెండు సూపర్ ఓవర్లు కూడా టైగా మారితే విజయం స్పష్టంగా తేలే వరకు సూపర్ ఓవర్లు ఆడుతూనే ఉండాలి. భారత్-ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్‌లో రెండో సూపర్ ఓవర్ కూడా టైగా ముగిసి ఉంటే అప్పుడు మూడో సూపర్ ఓవర్ అనివార్యమై ఉండేది.  

ఒకే బౌలర్‌ను పదేపదే ఉపయోగించుకోవచ్చా?
సూపర్ ఓవర్‌లో ఒకే బౌలర్‌ను పదేపదే ఉపయోగించడం కుదరదు. అయితే, తొలి సూపర్ ఓవర్‌ను అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌తో వేయించిన ఆఫ్ఘనిస్థాన్.. రెండో ఓవర్‌లోనూ అతడినే కోరుకుంది. ఫీల్డ్ అంపైర్లు ఇందుకు నిరాకరించారు. భారత జట్టు తొలి ఓవర్‌ను ముకేశ్ కుమార్‌తో వేయించి, రెండో ఓవర్‌ను రవి బిష్ణోయ్‌తో వేయించింది. 

ఏ జట్టు ముందు బ్యాటింగ్ చేయాలి? 

ఐసీసీ నిబంధన ప్రకారం.. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు సూపర్ ఓవర్‌లో తర్వాత బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే, తొలి సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు రెండో సూపర్ ఓవర్‌లో సెకండ్ బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ రూల్ వెనక సమయాన్ని ఆదా చేయడమన్న లాజిక్ ఉంది. అప్పటికే బ్యాటింగ్ చేసిన జట్టు సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మళ్లీ అందుకోసం రెడీ కావాల్సిన అవసరం ఉండదు. 

అదే బ్యాటర్ మళ్లీ బ్యాటింగ్‌కు దిగొచ్చా?
తొలి సూపర్ ఓవర్‌లో అవుట్ కానీ, లేదంటే రిటైర్డ్ హర్ట్ అయిన బ్యాటర్‌కు సూపర్ ఓవర్‌లో ఆడబోయే ముగ్గురు బ్యాటర్ల జాబితాలో ప్లేస్ ఉంటుంది. అయితే, ఒకవేళ ఆ బ్యాటర్ తొలి ఓవర్‌లో అవుట్ అయినా, రిటైర్డ్ అవుట్ అయినా రెండో సూపర్ ఓవర్‌లో ఆడడానికి వీల్లేదు. ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌లో రోహిత్ రిటైర్డ్ హర్ట్ అయ్యాడు కాబట్టే రెండో సూపర్ ఓవర్‌లో మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. రోహిత్ అలా రావడం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారడంతో ఐసీసీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

More Telugu News