Daggubati Purandeswari: 22న ఏపీ ప్రభుత్వం సెలవు ప్రకటించాలి: పురందేశ్వరి
- విజయవాడ పటమట సర్కిల్ లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించిన పురందేశ్వరి
- ఎన్టీఆర్ అంటే ఒక ప్రభంజనం అని వ్యాఖ్య
- అయోధ్య విగ్రహ ప్రతిష్ఠ రోజున ఏపీలో సెలవు ఇవ్వాలని సూచన
ఆకలితో అలమటిస్తున్న ఎందరో పేదలను రూపాయికి కిలో బియ్యంతో ఆదుకున్న గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కొనియాడారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విజయవాడ పటమట సర్కిల్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి, నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తెలుగు వారు ఆత్మగౌరవంతో తలెత్తుకోవడానికి కారకులైన వారిలో ఎన్టీఆర్ ఒకరని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్టీఆర్ ఎన్నో పథకాలను అమలు చేశారని పురందేశ్వరి అన్నారు. సంక్షేమం అనే పదానికి ఆయన మారుపేరని చెప్పారు. అందుకే ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. ఆయన ఒక వ్యక్తి కాదని... ఒక ప్రభంజనం అని చెప్పారు.
ఇక ఈ నెల 22న అయోధ్యలో ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోందని పురందేశ్వరి తెలిపారు. అయోధ్య రామ మందిరం భారతీయుల దశాబ్దాల కల అని చెప్పారు. ఈ నెల 22న రామ మందిర విగ్రహ పతిష్ఠ కార్యక్రమం జరగబోతోందని తెలిపారు. ఏపీలో ఈ నెల 21న మాత్రమే సెలవు ప్రకటించారని... 22న రోజున దేశం మొత్తం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారని చెప్పారు. 21న విజయవాడలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో సెలవు ప్రకటించడాన్ని తాము కూడా స్వాగతిస్తున్నామని... 22న కూడా సెలవు ప్రకటించాల్సి ఉన్నప్పటికీ ప్రకటించలేదని విమర్శించారు. 22న సెలవు ఇవ్వకపోవడం వెనుక వైసీపీ ప్రభుత్వ దురుద్దేశం అర్థమవుతోందని అన్నారు. అయోధ్య ఘట్టాన్ని అందరూ వీక్షించేందుకు సెలవు ఇవ్వాలని సూచించారు.