Pakistan: పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేయడంపై స్పందించిన భారత్
- ఈ వ్యవహారం ఇరు దేశాల మధ్య సమస్యగా పేర్కొన్న భారత విదేశాంగ శాఖ
- ఉగ్రవాదంపై దేశాల చర్యలను ఆత్మరక్షణ కోసమని అర్థం చేసుకోగలమని వ్యాఖ్య
- మీడియా ప్రశ్నల నేపథ్యంలో స్పందించిన విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఉగ్రవాద సంస్థ ‘జైష్ అల్-అద్ల్’ స్థావరాలపై ఇరాన్ ఇటీవల వైమానిక దాడులు చేయడంపై భారత్ స్పందించింది. ఈ వ్యవహారం పాకిస్థాన్, ఇరాన్‌ల మధ్య సమస్యగా పేర్కొని తన వైఖరిని స్పష్టం చేసింది. "భారత్ విషయానికి వస్తే ఉగ్రవాదం విషయంలో ఏమాత్రం రాజీలేదు. తీవ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదు. ఉగ్రవాదంపై దేశాలు తీసుకునే చర్యలు ఆత్మరక్షణ కోసమని అర్థం చేసుకోగలం’’ అని పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ బుధవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇరాన్ వైమానిక దాడులపై స్పందించాలంటూ మీడియా నుంచి ప్రశ్నలు ఎదురవుతున్న నేపథ్యంలో భారత్ ఈ విధంగా స్పందించింది.
కాగా.. పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ సరిహద్దు ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సున్నీ మిలిటెంట్ గ్రూప్ ‘జైష్ అల్ అద్ల్’ అనే ఉగ్రవాద సంస్థ స్థావరాలపై ఇటీవల ఇరాన్ వైమానిక దాడులు జరిపింది. క్షిపణులు, డ్రోన్లు ఉపయోగించి విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఉగ్రసంస్థకు చెందిన 2 ప్రధాన కార్యాలయాలు ధ్వంసమయ్యాయి. అయితే ఇరాన్ తమ గగనతలంలోకి చొరబడి దాడులు చేసిందని పాకిస్థాన్ ప్రభుత్వం మండిపడింది. దాడుల కారణంగా ఇద్దరు చిన్నపిల్లలు చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి తమ భూభాగంలోకి చొరబడిందని, చట్టవిరుద్ధ చర్యల పట్ల ప్రతిఘటించే హక్కు తమకు ఉందని పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి అన్నారు. కాగా 2012లో ఏర్పడిన ‘జైష్ అల్ అద్ల్’ను ఇరాన్ ఉగ్రసంస్థగా గుర్తించింది.