Jamie Lever: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ స్టార్ కమెడియన్ కుమార్తె

Johnny Lever daughter Jamie Lever makes debut in Telugu Film Industry

  • బాలీవుడ్ లో దిగ్గజ కమెడియన్ గా ఎదిగిన జానీ లీవర్
  • తండ్రి బాటలోనే నటనా రంగంలోకి జామీ 
  • ఇప్పటికే పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన వైనం
  • ఆ ఒక్కటి అడక్కు చిత్రం ద్వారా తెలుగులో అరంగేట్రం

మనకు బ్రహ్మానందం ఎలాగో, బాలీవుడ్ కు జానీ లీవర్ అలాగ! ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే... తెలుగువాడైన జానీ లీవర్ బాలీవుడ్ లో నెంబర్ వన్ కమెడియన్ గా పేరుతెచ్చుకున్నారు. జానీ లీవర్ స్వస్థలం ఏపీలోని ప్రకాశం జిల్లా కనిగిరి. ఆయన అసలు పేరు జాన్ రావు. 

జానీ లీవర్ తండ్రి పొట్టకూటి కోసం ముంబయి వలస వెళ్లి హిందూస్థాన్ లీవర్ కంపెనీలో చేరాడు. ఆ కంపెనీ పేరులోని లీవరే మన జాన్ రావు పేరులో చివర చేరింది. ఓ దశలో చదువుకోవడానికి డబ్బులు లేక, ఏడో తరగతితో చదువు ఆపేసిన జానీ లీవర్ అనేక కష్టాలు ఎదుర్కొని టాప్ కమెడియన్ గా పేరుతెచ్చుకున్నాడు. 

తండ్రి బాటలోనే జానీ లీవర్ కుమార్తె జామీ లీవర్ కూడా నటనా రంగంలోకి ప్రవేశించారు. అనేక బాలీవుడ్ సినిమాలతో ప్రతిభావంతురాలైన నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. జామీ లీవర్ ఇన్నాళ్లకు తన మాతృభాష తెలుగులో నటించనున్నారు. 

'చోటా భీమ్' నిర్మాత రాజీవ్ చిలక నిర్మిస్తున్న 'ఆ ఒక్కటి అడక్కు' చిత్రం ద్వారా ఆమె టాలీవుడ్ వెండితెరకు పరిచయం అవుతున్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ, తన మాతృభాష తెలుగులో సినిమా చేస్తుండడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. 

ముఖ్యంగా, తెలుగులో సినిమా చేయడం ద్వారా నాయనమ్మకు హృదయపూర్వక నివాళి అర్పిస్తున్నానని జామీ తెలిపారు. తెలుగులో సినిమా చేయాలన్నది తన కల అని, ఈ సినిమా వృత్తిపరంగానే కాకుండా, తన కుటుంబ మూలాల పరంగా భావోద్వేగాలతో కూడిన అంశం అని పేర్కొన్నారు.

More Telugu News