YS Sharmila: పవన్ కల్యాణ్ నివాసానికి వచ్చిన వైఎస్ షర్మిల

YS Sharmila met Pawan Kalyan

  • ఫిబ్రవరి 17న షర్మిల తనయుడి పెళ్లి... ఈ నెల 18న నిశ్చితార్థం
  • పవన్ కు పెళ్లిపత్రిక అందజేసిన షర్మిల
  • నిశ్చితార్థానికి కూడా రావాలంటూ ఆహ్వానం

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నేడు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. హైదరాబాదులో పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లిన షర్మిల తన కుమారుడి పెళ్లి కార్డు అందించారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి... అట్లూరి ప్రియను పెళ్లాడనున్న సంగతి తెలిసిందే. వీరి నిశ్చితార్థం జనవరి 18న జరగనుండగా, ఫిబ్రవరి 17న పెళ్లి జరగనుంది. 

ఈ నేపథ్యంలో, షర్మిల ప్రముఖులను కలుస్తూ, కుమారుడి శుభలేఖ అందించి, నిశ్చితార్థంతో పాటు పెళ్లికి కూడా రావాలని ఆహ్వానిస్తున్నారు. కాగా, రాజారెడ్డి-అట్లూరి ప్రియ నిశ్చితార్థం కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు హైదరాబాదులోని గోల్కొండ రిసార్ట్స్ వేదికగా నిలుస్తోంది. 

ఈ కార్యక్రమానికి షర్మిల సోదరుడు ఏపీ సీఎం జగన్ కూడా హాజరవుతున్నట్టు తెలుస్తోంది. షర్మిల తన కుమారుడి పెళ్లికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని, టీడీపీ అధినేత చంద్రబాబును కూడా ఆహ్వానించడం తెలిసిందే.

More Telugu News