India Canada Row: భారతీయ విద్యార్థులకు స్టడీ పర్మిట్లను భారీగా తగ్గించిన కెనడా
- గతేడాది చివరి త్రైమాసికంలో ఏకంగా 86 శాతం తగ్గుదల
- తీవ్ర ప్రభావం చూపించిన భారత్ - కెనడా మధ్య దౌత్య ఉద్రిక్తతలు
- ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యోదంతం నేపథ్యంలో దెబ్బతిన్న ఇరు దేశాల దౌత్య సంబంధాలు
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వ్యవహారంతో తలెత్తిన భారత్ - కెనడా వివాదం అక్కడికి వెళ్లే భారతీయ విద్యార్థులపై గట్టి ప్రభావాన్ని చూపించింది. కెనడా స్టడీ పర్మిట్ల సంఖ్యను భారీగా తగ్గించడంతో అక్కడికి వెళ్లే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. గతేడాది నాలుగవ త్రైమాసికంలో భారతీయ విద్యార్థులకు కెనడా జారీ చేసిన స్టడీ పర్మిట్ల సంఖ్య భారీగా తగ్గింది. అంతక్రితం త్రైమాసికంతో పోల్చితే ఏకంగా 86 శాతం తగ్గుదల నమోదయింది.
గతేడాది నాలుగవ త్రైమాసింకలో స్టడీ పర్మిట్ల సంఖ్య 14,910 ఉండగా మూడవ త్రైమాసికంలో ఈ సంఖ్య 108,940గా ఉందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ స్థాయిలో తగ్గుదలపై ఒట్టావాలోని హైకమిషన్ ఆఫ్ ఇండియా కౌన్సెలర్ గురు సుబ్రమణియన్ స్పందించారు. ఇటీవల ఇరుదేశాల మధ్య ఉద్రిక్తపూరిత వాతావరణం, కెనడాలోని విద్యాసంస్థల్లో సౌకర్యాల కొరత కారణంగా విద్యార్థులు ఇతర ప్రత్యామ్నాయ దేశాల వైపు మొగ్గుచూపుతున్నారని విశ్లేషించారు.
కాగా గత రెండు మూడు సంవత్సరాల్లో విద్య కోసం కెనడా వెళ్లిన విద్యార్థుల సంఖ్య భారీగా ఉందన్న విషయం తెలిసిందే. 2022లో కెనడా జారీ చేసిన స్టడీ పర్మిట్లలో భారతీయ విద్యార్థుల వాటా ఏకంగా 41 శాతంగా ఉండడం ఇందుకు అద్దం పడుతోంది. 2022లో ఏకంగా 225,835 మంది భారతీయ విద్యార్థులకు స్టడీ పర్మిట్లు లభించాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇదిలావుంచితే.. నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉందనడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గతేడాది జూన్లో ప్రకటించారు. దీనిని భారత్ తీవ్రంగా ఖండించడంతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలపై ప్రభావం చూపిన విషయం తెలిసిందే.