Klinkara: మెగా ఫ్యామిలీ ప్రిన్సెస్ క్లింకారపై పాట.. వీడియో ఇదిగో!

Special Song On Megastar Chiru Granddaughter Klinkara Released In YouTube

  • సంక్రాంతి రోజు యూట్యూబ్ లో విడుదల చేసిన ఉపాసన
  • చిరు కానుకగా రూపొందించామన్న నిర్మాత బెల్లంకొండ శ్రీధర్
  • పాటను ఆదరించిన ఉపాసనకు కృతజ్ఞతలు తెలిపిన ప్రొడ్యూసర్

మెగాస్టార్ చిరంజీవి మనుమరాలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూతురు క్లింకారపై రూపొందించిన పాట యూట్యూబ్ లో వైరల్ గా మారింది. సంక్రాంతి పండుగ సందర్భంగా రాంచరణ్ భార్య ఉపాసన చేతుల మీదుగా ఈ పాట యూట్యూబ్ లో విడుదలైంది. చిరు కుటుంబంపై అభిమానంతో రచయిత, నిర్మాత, దర్శకుడు బెల్లంకొండ శ్రీధర్ (రఘు) దీనిని నిర్మించారు. కిలకిల నవ్వింది క్లింకారా.. అంటూ సాగే ఈ పాట శ్రీమతి ఉపాసనకు, మెగా ఫ్యామిలీ అభిమానులకు నచ్చడం తమ అదృష్టమని శ్రీధర్ తెలిపారు. యూట్యూబ్ లో పాట విడుదల సందర్భంగా ఆయన ఈమేరకు సోమవారం ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.

క్లింకార రాక మెగాస్టార్ ఇంటిని సంతోషాల పొదరిల్లుగా మార్చిందని, అభిమానులకు కనులపండుగలా చేసిందని నిర్మాత శ్రీధర్ చెప్పారు. మెగాస్టార్ ఇంట ఆనందాలు నింపిన క్లింకారపై తాము రూపొందించిన పాట ఉపాసన కొణిదెలకు నచ్చడం తమ అదృష్టమని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ పాటను ఉపాసన యూట్యూబ్ లో విడుదల చేశారని వివరించారు. ఈ పాటకు మహావీర్ యెల్లెందర్ సంగీతం అందించగా ధనుంజయ్ పాడారు. అనీల్ తోట, వీరబాబు కొంమూరి సహకారం అందించారని నిర్మాత శ్రీధర్ తెలిపారు. క్లింకారపై రూపొందించిన ఈ పాటను అందరికీ చేరువయ్యేందుకు అన్ని విధాలా సహకరించి అండగా నిలచిన రవణం స్వామినాయుడుకు బెల్లంకొండ శ్రీధర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

More Telugu News