Mohan Babu: భారతీయులు అని ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాం అంటే ఆయనే కారణం: మోహన్ బాబు

Mohan Babu heaps praises in PM Modi

  • తిరుపతిలో హనుమాన్ చాలీసా పఠనం
  • హాజరైన మోహన్ బాబు
  • ఎప్పటికీ మోదీనే ప్రధానిగా ఉండాలని ఆకాంక్ష
  • అయోధ్య నుంచి తనకు కూడా ఆహ్వానం అందిందని వెల్లడి

ప్రముఖ నటుడు మోహన్ బాబు తిరుపతిలో నిర్వహించిన హనుమాన్ చాలీసా పఠనం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

"ఇవాళ నేను ఏం మాట్లాడినా అది అతిశయోక్తి అనుకుంటారు... కానీ నేను చెప్పేది అతిశయోక్తి  కాదు. భారతదేశంలో ఈ మాత్రం ధైర్యంగా మనం భరతమాత బిడ్డలం, భారతీయులం, హిందువులం అని చెప్పుకోగలుగుతున్నాం అంటే అందుకు కారణం ప్రధాని మోదీ ఒక్కరే. ఆయన లేకపోతే పరిస్థితులు మరోలా ఉండేవి. 

మనం ఉన్న పరిస్థితుల్లో కులాలు ఏవీ లేవు, అందరూ ఒకటే అని ముందుకెళుతుంటే...  తెలిసో తెలియకో కొందరు అజ్ఞానులు కులాల గురించి మాట్లాడుతుంటారు. కానీ మన ప్రధాని మనమందరం ఒక్కటే అని చాటేలా ఇలాంటి కార్యక్రమాలు జరుపుతున్నారు. అక్కడ అయోధ్యలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. మోదీ చేస్తున్నవి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని, నిండు నూరేళ్లు జీవించాలని, ఎల్లప్పుడూ ఆయన మనకు ప్రధానిగా ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను.

మోదీ ప్రధాని కాకముందే ఆయనను మేం కుటుంబ సమేతంగా పార్క్ హయత్ హోటల్ లో కలిశాం. సార్... మీరు ప్రధాని కావాలని కోరుకుంటున్నాం అని చెప్పాం. అందుకాయన స్పందిస్తూ... ఎందుకు? అన్నారు. దాంతో కొన్ని అంశాలను ఆయనకు వివరించాం. దాంతో ఆయన సంతృప్తి చెంది... నువ్వు నిజమైన కళాకారుడివి అని అభినందించారు. దేవుడి దయ ఎలా ఉందో... చూద్దాం అని అన్నారు. ఆ విధంగా ఆయన రెండు పర్యాయాలు విజయాలు సాధించారు. ఆయన మూడోసారి కూడా గెలుస్తారు. 

ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో, మరెన్నో జరగాలని, భారతదేశం సుభిక్షంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు" అంటూ స్పందించారు. 

ఇక అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి తనకు కూడా ఆహ్వానం వచ్చిందని మోహన్ బాబు వెల్లడించారు. ఎవరి నుంచి ఆహ్వానం అందాలో వారి నుంచే ఆహ్వానం అందిందని... అయితే, వెళ్లాలో, వద్దో ఇంకా నిర్ణయించుకోలేదని తెలిపారు. 

"రామ మందిరం ప్రారంభోత్సవానికి చాలామంది వస్తున్నారు. అంతమంది మధ్యలో నేను తట్టుకోగలనో, లేదో... వెళ్లాలని మనసులో సంకల్పం ఉంది... హనుమంతుడి ఆశీస్సులు, ఈశ్వరేచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది" అంటూ మోహన్ బాబు వ్యాఖ్యానించారు.

Mohan Babu
Narendra Modi
Ayodhya Ram Mandir
Invitation
Tirupati
Andhra Pradesh
  • Loading...

More Telugu News