Virat Kohli: సడెన్‌గా గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి కోహ్లీని కౌగిలించుకున్న వీరాభిమాని.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

a fan suddenly came to Virat Kohli and hugged him in 2nd t20i against Afghanistan in Indore

  • ఇండోర్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌పై ఆదివారం రాత్రి జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో చోటుచేసుకున్న ఘటన
  • భద్రతా నిబంధనలను ఉల్లంఘించడంతో యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • విచారణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేసిన ఇండోర్ పోలీసులు

భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఆదివారం రాత్రి ఇండోర్‌లో జరిగిన 2వ టీ20 మ్యాచ్‌లో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. దాదాపు 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత టీ20 ఫార్మాట్‌లో తొలి మ్యాచ్ ఆడిన కోహ్లీని చూసి స్టేడియంలోని అభిమానులు కేరింతలు కొట్టారు. కోహ్లీ... కోహ్లీ.. అని బిగ్గరగా అరుస్తూ మైదానాన్ని మోత ఎక్కించారు. అయితే విరాట్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని కాస్త శ‌ృతిమించి ప్రవర్తించాడు. మైదానంలోకి ఒక్కసారిగా పరిగెత్తుకొచ్చి కోహ్లీని కౌగిలించుకున్నాడు. ఆఫ్ఘనిస్థాన్ ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. కోహ్లీని ఎలాగైనా కలవాలని భావించిన అభిమాని ఈ విధంగా తన కోరికను నెరవేర్చుకున్నప్పటికీ అతడు భద్రతా నిబంధనలను ఉల్లంఘించినట్టయ్యింది. దీంతో మైదానంలో ఉన్న భద్రతా సిబ్బంది సదరు ఫ్యాన్‌ని అదుపులోకి తీసుకుని తుకోగంజ్ స్టేషన్‌కు పోలీసులు తరలించారు. 

సదరు యువకుడి దగ్గర మ్యాచ్ టికెట్ ఉందని తెలిపారు. నరేంద్ర హిర్వానీ గేట్ నుంచి మైదానంలోకి ప్రవేశించాడని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఆ యువకుడు కోహ్లీకి వీరాభిమానిలా కనిపిస్తున్నాడని, ఎలాగైనా కలవాలనే కోరికతోనే ప్రేక్షకుల గ్యాలరీ నుంచి కంచె దాటి మైదానంలోకి ప్రవేశించాడని తెలిపారు. ఈ ఘటనపై యువకుడిని విచారిస్తున్నట్టు తెలిపారు. విచారణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇదిలావుంచితే కోహ్లీని ఫ్యాన్ కౌగిలించుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

కాగా 14 నెలల తర్వాత తొలి టీ20 మ్యాచ్ ఆడిన కోహ్లీ దూకుడుగా ఆడాడు. లక్ష్యం చిన్నది కావడంతో షాట్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 15 బంతులు ఎదుర్కొని 181.25 స్ట్రైక్ రేట్‌తో 29 పరుగులు నమోదు చేశాడు. ఇందులో 5 ఫోర్లు ఉన్నాయి. కాగా ఇండోర్ టీ20 మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై టీమిండియా ఘనవిజయం సాధించింది. దీంతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ గెలుచుకుంది.

More Telugu News