Lok Sabha elections: వచ్చే లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Senior Congress leader Shashi Tharoor made interesting comments on the upcoming Lok Sabha elections

  • బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది కానీ సీట్ల సంఖ్య బాగా తగ్గుతుందని విశ్లేషణ
  • మద్దతు విషయంలో మిత్రపక్షాలు పునరాలోచించుకునే స్థాయికి కాషాయ పార్టీ సీట్ల సంఖ్య తగ్గుతుందన్న కాంగ్రెస్ సీనియర్ నేత
  • బీజేపీకి ప్రతిపక్ష పార్టీల మద్దతు అవసరం అవుతుందని వ్యాఖ్య
  • కేరళలో ఓ లిటరేచర్ ఫెస్టివల్‌లో మాట్లాడిన శశిథరూర్

తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ వచ్చే లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏకైక అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తుందని అంచనా వేశారు. అయితే మిత్రపక్షాలు తమ మద్దతుపై పునరాలోచించుకునే స్థాయికి బీజేపీ సీట్ల సంఖ్య తగ్గుతుందని, ప్రభుత్వ ఏర్పాటులో బహుశా ప్రతిపక్షంతో జతకట్టాల్సి రావొచ్చని శశిథరూర్ విశ్లేషించారు. కేరళలో ‘లిటరేచర్ ఫెస్టివల్ సెషన్‌’లో 'ఇండియా - ది ఫ్యూచర్ ఈజ్ నౌ' అనే అంశంపై మాట్లాడుతూ థరూర్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశ వైవిధ్యం, అన్నీ రాష్ట్రాలలో ఏకగ్రీవ అవగాహన ఒప్పందాలను సాధించడంలో ప్రతిపక్ష ఇండియా (I.N.D.I.A)  కూటమికి ఎదురవుతున్న సవాళ్లపై ఆయన మాట్లాడారు. అన్ని రాష్ట్రాల్లోని అన్ని ప్రతిపక్ష పార్టీల మధ్య పూర్తిస్థాయిలో ఒప్పందం సాధ్యం కాకపోయినప్పటికీ బీజేపీ సీట్ల సంఖ్య బాగా తగ్గిపోయేలా ప్రయత్నించాలని ఆయన అన్నారు. ప్రతిపక్షాలతో జట్టు కట్టే స్థాయికి బీజేపీని తీసుకురావాలని అన్నారు.

ఇండియా కూటమిలో పార్టీల మధ్య సీట్ల పంపకం విషయం సంక్లిష్టంగా మారడంపై స్పందిస్తూ.. కూటమిలో పార్టీల సంఖ్య ఎక్కువగా ఉండడం ఇందుకు కారణమని అన్నారు. గెలుపు అవకాశాలున్న చోట్ల ఓటముల నుంచి గట్టెక్కెలా తగిన ఒప్పందాలు కుదుర్చుకోవాల్సిన అవసరం ఉందని శశిథరూర్ అభిప్రాయపడ్డారు. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలపాలని నిర్ణయించగా.. మరికొన్ని చోట్ల ఆ పరిస్థితి లేదన్నారు. ప్రతిపక్షాలకు సంబంధించిన అభ్యర్థుల సంఖ్య ఒకటికి మించి ఉంటే ఓటర్లు తమ ప్రాధాన్యతల ఆధారంగా ఓటు వేస్తారని అన్నారు. ఇందుకు కేరళ, తమిళనాడులో పరిస్థితులను ఉదాహరణగా వివరించారు. సీట్ల భాగస్వామ్య విషయంలో వ్యత్యాసాలున్నాయని పేర్కొన్నారు. తమిళనాడుతో పోలిస్తే కేరళలో సీట్ల పంపకం విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. సీపీఐ (ఎం), కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకం సవాలుగా మారిందన్నారు.

  • Loading...

More Telugu News