America: అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

Telugu Students Mysterious Death In America

  • రెండు వారాల క్రితమే అమెరికాకు వెళ్లిన వనపర్తి యువకుడు
  • ఇంతలోనే కొడుకు చనిపోయాడంటూ తల్లిదండ్రులకు సమాచారం
  • మరొకరు శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువకుడిగా గుర్తింపు

ఉన్నత చదువుల కోసం కోటి ఆశలతో అమెరికా విమానం ఎక్కిన ఓ యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అమెరికా వెళ్లిన రెండు వారాల్లోనే అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. రూమ్ లో ఆ యువకుడితో పాటు మరో యువకుడి మృతదేహాలను గుర్తించిన పోలీసులు.. ఇండియాలోని తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. బాధిత కుటుంబం వెల్లడించిన వివరాల ప్రకారం..

వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన గట్టు వెంకన్నకు ఒక కొడుకు, ఒక కూతురు.. డిగ్రీ పూర్తిచేసిన కొడుకు గట్టు దినేశ్ ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లాడు. పదహారు రోజుల క్రితం వెంకన్న కుటుంబంతో సహా ఎయిర్ పోర్టుకు వెళ్లి కొడుకుకు సెండాఫ్ ఇచ్చాడు. ఇంతలోనే దినేశ్ చనిపోయాడంటూ అమెరికా పోలీసుల నుంచి సమాచారం అందిందని వెంకన్న చెప్పాడు. దినేశ్ ఉంటున్న రూమ్ లో ఇద్దరు యువకుల మృతదేహాలను గుర్తించామని చెప్పారన్నాడు.

తన కొడుకు దినేశ్ తో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో యువకుడు చనిపోయాడని, ఏం జరిగిందనే విషయం ఇంకా తెలియలేదని వివరించాడు. యువకుల మరణాలకు కారణమేంటనే విషయం ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్పారన్నాడు. కొడుకు చనిపోయాడని తెలియడంతో గట్టు వెంకన్న కుటుంబంలో విషాదం నెలకొంది.

More Telugu News