Jaishankar: భారత్‌ను సంప్రదించకుండా ప్రపంచంలో ఏ ప్రధాన సమస్యపైనా నిర్ణయం జరగడం లేదు: జైశంకర్

No major world issue is decided without consulting India says Jaishankar

  • భారత్ సరికొత్తగా రూపాంతరం చెందిందని వ్యాఖ్యానించిన మంత్రి
  • మన దేశంపై ప్రపంచ దేశాల దృష్టికోణం కూడా మారిందన్న జైశంకర్
  • వేరే దేశానికో లేక సంస్థకో అనుబంధంగా ఉండే ప్రసక్తిలేదని వెల్లడి
  • నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి జైశంకర్

‘‘ భారత్ సరికొత్తగా రూపాంతరం చెందింది. మన దేశంపై ప్రపంచ దేశాల దృష్టికోణంలో కూడా మార్పు వచ్చింది’’ అని విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. ఇండియాతో సంప్రదింపులు జరపకుండా ప్రపంచంలోని ఏ ప్రధాన సమస్యపైనా నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపించడంలేదని అన్నారు. ‘భౌగోళిక రాజకీయాల్లో భారత్ పురోగమనం’ పేరిట నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చాలా దేశాలు భారత్ శక్తిసామర్థ్యాన్ని, ప్రభావాన్ని గమనిస్తున్నాయని అన్నారు. 10 సంవత్సరాల క్రితం ప్రపంచంలో పదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న దేశం ప్రస్తుతం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ఆయన ప్రస్తావించారు. మరికొన్నేళ్లలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన 'అమృత్ కాల్' విజన్‌పై మాట్లాడుతూ.. ఈ 10 సంవత్సరాలను పునాదిగా భావించాలని, రాబోయే 25 ఏళ్ల భవిష్యత్ నిర్మాణం జరుగుతుందని దీమా వ్యక్తం చేశారు. భారతదేశానికి కనీసం 5,000 ఏళ్ల నాగరికత ఉందని, అత్యధిక జనాభా కలిగిన నాగరికత దేశానిదని అన్నారు. భౌగోళికంగా అతిపెద్ద దేశాలలో ఒకటిగా, ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్న భారత్ స్వభావరీత్యా స్వతంత్రంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. వేరే దేశానికో లేక సంస్థకో అనుబంధంగా ఉండకూడదని అన్నారు. స్వతంత్రంగా ఉంటూనే దేశ ప్రయోజనాల కోసం వేర్వేరు వ్యక్తులు లేదా దేశాలతో చాకచక్యంగా వ్యవహరించాలన్నారు.

సరిహద్దు వెంబడి ప్రతిష్ఠంభన పరిస్థితుల్లో భారత్‌తో సంబంధాలు సాధారణంగా కొనసాగుతాయని చైనా ఆశించకూడదని జైశంకర్ హెచ్చరించారు. అయితే దౌత్య సంబంధాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. సంక్లిష్ట పరిస్థితుల్లో కొన్నిసార్లు పరిష్కారాలు త్వరగా లభించబోవని అన్నారు. భారత్, చైనాల సరిహద్దు విషయంలో పరస్పరం అంగీకారం లేకపోవడంతో ఇరువైపులా దళాలను మోహరించడం సబబు కాదన్నారు. ఒక దేశం కదలికల గురించి మరొక దేశానికి తెలియజేయాలని నిర్ణయించామని, అయితే 2020లో జరిగిన ఈ ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించిందని మంత్రి జైశంకర్ అన్నారు.

More Telugu News