Andhra Pradesh: జైన సన్యాసినిగా మారబోతున్న 19 ఏళ్ల ఏపీ యువతి!
- చిత్తూరుకు చెందిన యోగిత సురానా
- బంధాలు, అనుబంధాలను త్యజించి జైన సన్యాసినిగా మారాలని నిర్ణయం
- ఈ నెల 16న ముహూర్తం
19 ఏళ్ల వయసులో ఎవరికైనా ఉత్సాహం ఉరకలెత్తుతుంది. అడ్డంకుల్ని అమాంతం నలిపేసి లక్ష్యం వైపు సాగిపోయేందుకు కావాల్సిన శక్తిసామర్థ్యాలు ఆ ప్రాయంలో పుష్కలంగా ఉంటాయి. అన్నింటికీ మించి ప్రపంచం రంగులమయంగా కనబడుతుంది. కోరికలు ఎల్లలు దాటి స్వేచ్ఛా విహంగాలై ఎగురుతూ ఉంటాయి. ఇంతటి అనుభూతులు పంచే వయసులో ఓ యువతి ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకుంది. జైన సన్యాసినిగా మారబోతోంది. కోరికలన్నిటినీ మూటకట్టి అటకమీదికి ఎక్కించేసి మరో ప్రపంచంలోకి అడుగిడబోతోంది.
ఆమె పేరు యోగిత సురానా. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరుకు చెందిన ఆమె కోరికలు, అనుబంధాలు, బాంధవ్యాలను త్యజించి జైన సన్యాసినిగా మారాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ సోమాజీగూడలో మీడియా సమావేశంలో ఆమె ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. తల్లిదండ్రులు పద్మరాజ్ సురానా, స్వప్న సురానా జైన సామాజిక వర్గ పెద్దలతో కలిసి మాట్లాడిన అనంతరం ఈ విషయాన్ని వారు తెలిపారు. ఈ నెల 16న యోగిత సన్యాసినిగా మారబోతున్నట్టు పేర్కొన్నారు.