Atal Setu: దేశంలోనే అత్యంత పొడవైన 'అటల్ సేతు' సముద్ర వంతెనను ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi inaugurates Atal Setu in Mumbai

  • ముంబయి, నవీ ముంబయి మధ్య వంతెన
  • అటల్ సేతుగా నామకరణం
  • బ్రిడ్జి పొడవు 21.8 కిలోమీటర్లు... సముద్రంపైనే 16.5 కిలోమీటర్ల వంతెన
  • 17,840 కోట్ల వ్యయంతో భారీ వంతెన
  • నేడు జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ మహారాష్ట్రలో పర్యటించారు. ముంబయిలో నిర్మించిన అత్యంత పొడవైన సముద్ర వంతెన అటల్ సేతును ప్రారంభించారు. ఈ భారీ ప్రాజెక్టును లాంఛనంగా జాతికి అంకితం చేశారు. అనంతరం ఆ వంతెనపై కొద్దిదూరం నడిచారు. వంతెనకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా పాల్గొన్నారు.

ముంబయి, నవీ ముంబయి ప్రాంతాలను కలుపుతూ సముద్రం మీదుగా సాగిపోయే ఈ వంతెన పొడవు 21.8 కిలోమీటర్లు. ఈ వంతెన సముద్రంపై 16.5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ వంతెన నిర్మాణంతో ముంబయి, నవీ ముంబయిల మధ్య ప్రయాణ దూరం 20 నిమిషాలకు తగ్గనుంది. 

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి గౌరవార్థం ఈ వంతెనకు అటల్ సేతు అని నామకరణం చేశారు. అటల్ సేతు నిర్మాణం 2016లో ప్రారంభమైంది. ఈ భారీ వంతెన నిర్మాణంలో పారిస్ లోని ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ లో వాడిన ఇనుము కంటే 17 రెట్లు అధికంగా ఇనుమును వినియోగించారు. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నిర్మాణానికి ఉపయోగించిన కాంక్రీట్ కంటే 6 రెట్లు అధికంగా కాంక్రీట్ ను వాడారు. ఈ వంతెన కోసం రూ.17,840 కోట్లు ఖర్చు చేశారు. 

కాగా, అటల్ సేతుపై భద్రత కోసం పటిష్ఠ చర్యలు తీసుకున్నారు. ఈ వంతెన పొడవునా 400 సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వలస పక్షులైన ఫ్లెమింగోలకు ఇబ్బంది కలగకుండా, సౌండ్ బారియర్ టెక్నాలజీ వినియోగించారు.

More Telugu News