David Warner: మ్యాచ్ ఆడేందుకు హెలికాప్టర్ లో నేరుగా స్టేడియంలో దిగిన వార్నర్... వీడియో వైరల్

David Warner comes to SCG on helicopter

  • ఇటీవలే టెస్టులు, వన్డేలకు వార్నర్ వీడ్కోలు
  • ప్రస్తుతం టీ20ల్లో ఆడుతున్న వార్నర్
  • నేడు బిగ్ బాష్ లీగ్ లో సిడ్నీ సిక్సర్-సిడ్నీ థండర్ జట్ల మ్యాచ్
  • సోదరుడి పెళ్లి కోసం హంటర్ వ్యాలీ వెళ్లిన వార్నర్
  • మ్యాచ్ అందుకునేందుకు చాపర్ లో వచ్చిన వైనం

ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇటీవలే టెస్టులు, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం వార్నర్ అంతర్జాతీయ టీ20లు, టీ20 లీగ్ లు మాత్రమే ఆడుతున్నాడు. ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ టీ20 లీగ్ జరుగుతుండగా... వార్నర్ ఓ మ్యాచ్ కోసం హెలికాప్టర్ లో నేరుగా స్టేడియంలో దిగడం విశేషం. 

అసలేం జరిగిందంటే... వార్నర్ బిగ్ బాష్ లీగ్ లో సిడ్నీ థండర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇవాళ సిడ్నీ థండర్ జట్టు-సిడ్నీ సిక్సర్స్ మ్యాచ్ ఉంది. అయితే, వార్నర్ తన సోదరుడి పెళ్లి కోసం ఉదయాన్నే హంటర్ వ్యాలీకి వెళ్లాడు. అక్కడ వివాహ వేడుకలో పాల్గొన్న వార్నర్... అక్కడ్నించి హెలికాప్టర్ లో సిడ్నీ బయల్దేరాడు. 

ఆ హెలికాప్టర్ నేరుగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్ సీజీ)లో దిగడంతో అందరూ ఆశ్చర్యపోయారు. హెలికాప్టర్ నుంచి దిగిన వార్నర్ వెంటనే నెట్ ప్రాక్టీసుకు వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 

పాపం... వార్నర్ ఈ మ్యాచ్ ను అందుకోవడానికి హెలికాప్టర్ లో వచ్చినా ప్రయోజనం లేకపోయింది. సిడ్నీ సిక్సర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో సిడ్నీ థండర్ జట్టు ఓడిపోయింది. 

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో వార్నర్ ప్రాతినిధ్యం వహిస్తున్న థండర్ జట్టు 19.5 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ గా దిగిన వార్నన్ 39 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో 37 పరుగులు చేసి అవుటయ్యాడు.

  • Loading...

More Telugu News