Sunil Kanugolu: లోక్ సభ ఎన్నికల నుంచి వ్యూహకర్త సునీల్ కనుగోలును తప్పించిన కాంగ్రెస్!

Congress reportedly sidelines Sunil Kanugolu from Lok Sabha elections

  • కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తగా ఉన్న సునీల్ కనుగోలు
  • కర్ణాటక, తెలంగాణ విజయాల్లో కీలకపాత్ర 
  • లోక్ సభ ఎన్నికల టాస్క్ ఫోర్స్-2024లో స్థానం కల్పించిన కాంగ్రెస్
  • ఇప్పుడా బాధ్యతల నుంచి తప్పించిన హస్తం పార్టీ
  • సునీల్ కు హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలు

ఇటీవల కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడం వెనుక ఉన్న మాస్టర్ మైండ్ సునీల్ కనుగోలు. చిన్న వయసులోనే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న సునీల్ కనుగోలు కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలకు వ్యూహరచన చేసి, ఆ పార్టీ గద్దెనెక్కడంలో కీలకపాత్ర పోషించాడు. 

అయితే, మరికొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు రానున్న తరుణంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సునీల్ కనుగోలు లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సేవలు అందించబోరని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయన సేవలను హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్టు  తెలిపాయి. 

మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలు ఈ ఏడాదే ఎన్నికలు జరుపుకోనున్నాయి. ఎంతో కీలకమైన ఈ రాష్ట్రాల్లో అధికారం చేపట్టడంపై హస్తం పార్టీ దృష్టి సారించింది. ఇప్పటికే తమకు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో గెలుపును అందించిన సునీల్ కనుగోలును లోక్ సభ ఎన్నికలకు కాకుండా... మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. 

సునీల్ కనుగోలుపై కాంగ్రెస్ అధిష్ఠానం ఎంతో నమ్మకం ఉంచింది. లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టాస్క్ ఫోర్స్-2024లో ఆయనకు స్థానం కల్పించింది. సునీల్ కనుగోలు కూడా తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరేందుకు తన వంతు కృషి చేశాడు. 

అయితే, ఇప్పుడు ఆయనను లోక్ సభ ఎన్నికల టాస్క్ ఫోర్స్ నుంచి తప్పించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనిపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ... సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగుతాడని స్పష్టం చేశారు. అంతేకాదు, సునీల్ కనుగోలు ఇకపైనా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ ర్యాంక్ తో కొనసాగుతాడని, తెలంగాణలోనూ సేవలు అందిస్తాడని వివరించారు.

More Telugu News