Global Heat Record: భూగోళానికి పొంచివున్న విపత్తు.. అత్యంత వేడి సంవత్సరంగా 2023
- 2016 రికార్డులు బద్దలుగొట్టిన 2023 క్యాలెండర్ ఇయర్
- ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 14.98 డిగ్రీలుగా నమోదు
- 2016 నాటి కంటే 0.17 డిగ్రీలు అధికం
- వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ 421 పీపీఎంకు చేరిక
- ఇది 14 మిలియన్ సంవత్సరాల కంటే అధికం
2023 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డులకెక్కింది. ఈ దెబ్బకు గత రికార్డులు మాయమయ్యాయి. మునుపటి రికార్డులతో పోలిస్తే 2023లో 1.48 డిగ్రీలు అత్యధికంగా నమోదై పారిస్ ఒప్పందంలో నిర్దేశించిన 1.5 డిగ్రీల థ్రెషోల్డ్‌కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఈ రకంగా పెరగడంపై సర్వత్ర ఆందోళన కనిపిస్తోంది. భవిష్యత్తులో భూమి ఎదుర్కోబోతున్న విపత్తులకు ఇది నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే పర్యావరణ వ్యవస్థలు, ఆర్థిక వ్యవస్థలకు ముప్పు వాటిల్లక తప్పదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
ఉష్ణోగ్రతల్లో 2016 రికార్డును 2023 బద్దలుగొట్టి హాటెస్ట్ క్యాలెండర్ ఇయర్‌గా నమోదైంది. గత ఏడాది ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 14.98 డిగ్రీలుగా నమోదైంది. ఇది 2016 కంటే 0.17 డిగ్రీలు అధికం. భూగోళం వేడెక్కుతోందనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. మరోవైపు, అంటార్కిటిక్ సముద్రపు మంచు కూడా రోజురోజుకు కుచించుకుపోతోంది. గతేడాది అంటార్కిటిక్ సముద్రపు మంచు ఎనిమిది వేర్వేరు నెలల్లో రికార్డు స్థాయికి చేరుకుంది. ఫిబ్రవరిలో ఇది రికార్డుస్థాయికి చేరుకుంది. ఇంకోవైపు, వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయులు కూడా పెరిగి 421 పీపీఎంకు చేరుకున్నాయి. ఇది 14 మిలియన్ సంవత్సరాలకంటే అధికం.