Shree Rapaka: జగన్ గారు అవకాశం ఇస్తే వైసీపీ తరఫున పోటీ చేస్తా: నటి శ్రీ రాపాక

Actress Shree Rapaka seeks YCP ticket

  • రాజకీయాలపై ఆసక్తి ప్రదర్శిస్తున్న టాలీవుడ్ నటి
  • జగన్ అంటే తనకిష్టమంటున్న శ్రీ రాపాక
  • చాన్స్ ఇస్తే గోపాలపురం నుంచి పోటీ చేస్తానని వెల్లడి

టాలీవుడ్ నటి శ్రీ రాపాక ఎన్నికల బరిలో దిగేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. తనకు జగన్ అంటే చాలా ఇష్టం అని, ఈ ఐదేళ్లలో ఆయన పరిపాలన ఎంతో బాగుందని కితాబునిచ్చారు. నవరత్నాల పథకాలను సక్రమంగా అమలు చేస్తున్నారని, ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేస్తున్నారని కొనియాడారు. జగన్ అవకాశం ఇస్తే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెబుతున్నారు.

తాను స్వతహాగా క్రీడాకారిణినని, ఖో ఖో, కబడ్డీ, బాస్కెట్ బాల్ పోటీల్లో జాతీయస్థాయి వరకు వెళ్లానని శ్రీ రాపాక వెల్లడించారు. ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసి హైదరాబాద్ వెళ్లానని, సినిమా రంగంలో ప్రవేశించానని వెల్లడించారు.

ఇవాళ గుడికి వచ్చి జగన్ గారు మళ్లీ సీఎం కావాలని దేవుడ్ని కోరుకున్నానని శ్రీ రాపాక తెలిపారు. జగన్ గారు ఆశీర్వదిస్తే వచ్చే ఎన్నికల్లో గోపాలపురం (ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా) నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తానని మనసులో మాట వెల్లడించారు. 

తాను కూడా అక్కడక్కడా ప్రజాసేవా కార్యక్రమాలు చేస్తున్నానని, అధికారంలో ఉంటే ఇంకా ఎక్కువగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. జగన్ గారు కొత్త తరాన్ని ప్రోత్సహిస్తున్నారని, అందుకే తాను కూడా ప్రయత్నిస్తున్నానని వెల్లడించారు.

Shree Rapaka
Jagan
YSRCP
Gopalapuram
Elections
Actress
Tollywood

More Telugu News