Rahul Dravid: కావాలనే ఇషాన్ కిషన్ ను జట్టు నుంచి తప్పించారంటూ వార్తలు... ద్రావిడ్ స్పందన

Dravid explains why Ishan Kishan not selected for T20 series against Afghanistan

  • రేపటి నుంచి టీమిండియా, ఆఫ్ఘనిస్థాన్ టీ20 సిరీస్
  • మొహాలీలో మొదటి మ్యాచ్
  • ఇషాన్ కిషన్ కు వ్యక్తిగత కారణాలతో విశ్రాంతినిచ్చామన్న ద్రావిడ్
  • అతడే విరామం కోరాడని వెల్లడి

జనవరి 11 నుంచి టీమిండియా, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య టీ20 సిరీస్ జరగనుంది. అయితే, ఈ మూడు మ్యాచ్ ల సిరీస్ కు వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఇషాన్ కిషన్ ను ఎంపిక చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటన నుంచి వ్యక్తిగత కారణాల పేరిట అర్ధంతరంగా వచ్చేసిన ఇషాన్ కిషన్... దుబాయ్ లో ఓ పార్టీలో దర్శనమిచ్చాడు. కౌన్ బనేగా కరోడ్ పతి టీవీ షోలోనూ పాల్గొన్నాడు. ఈ పరిణామాలతో ఆగ్రహించిన బీసీసీఐ అతడిపై క్రమశిక్షణ చర్యల కింద వేటు వేసిందంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

దీనిపై టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించాడు. మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు. ఇషాన్ కిషన్ విశ్రాంతి కావాలని కోరాడని, సెలెక్షన్ కు అతడే అందుబాటులో లేకుండా పోయాడని వివరణ ఇచ్చాడు. ఇందులో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన అంశాలేవీ లేవని ద్రావిడ్ స్పష్టం చేశాడు. 

"ఇషాన్ కిషన్ కొంత విరామం కావాలని కోరాడు... మేం అందుకు అంగీకరించాం. అంతే తప్ప అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. ఒకవేళ ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్ లో ఆడితే అతడు సెలెక్షన్ కు అందుబాటులోకి వచ్చినట్టు భావిస్తాం" అని ద్రావిడ్ స్పష్టం చేశాడు. 

ఇక మరో స్టార్ బ్యాట్స్ మన్ శ్రేయాస్ అయ్యర్ కు కూడా ఆఫ్ఘన్ తో టీ20 సిరీస్ కు టీమిండియాలో చోటు దక్కకపోవడం పట్ల ద్రావిడ్ స్పందించాడు. అయ్యర్ ను ఎంపిక చేయకపోవడం దురదృష్టకరమని, జట్టులో ఇప్పటికే చాలామంది బ్యాట్స్ మన్లు ఉన్నారని అన్నాడు. అంతే తప్ప, అయ్యర్ ను ఎంపిక చేయకపోవడానికి ప్రత్యేకమైన కారణాలేవీ లేవని స్పష్టం చేశాడు.

More Telugu News