Civil Service: గ్లామర్ కోసమో.. డబ్బు కోసమో సివిల్ సర్వీసెస్ లోకి రావొద్దు: జయప్రకాశ్ నారాయణ్ సలహా
- కలెక్టర్ పోస్టుకు అపారమైన హీరోయిజాన్ని ఆపాదిస్తున్నారని వ్యాఖ్య
- ఎంతో ఊహించుకుని సివిల్ సర్వీసెస్ లోకి వచ్చాక నిరాశ చెందుతున్నారని వివరణ
- ముఖ్యమంత్రో, ప్రధాన మంత్రో రాజు అనుకోవడం మూర్ఖత్వమని వెల్లడి
ప్రస్తుత సమాజంలో సివిల్ సర్వీసెస్ విషయంలో చాలా అపోహలు నెలకొన్నాయని, కలెక్టర్ పోస్టుకు అపారమైన హీరోయిజాన్ని ఆపాదిస్తున్నారని మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ్ చెప్పారు. యువత ఎంతో ఊహించుకుని సివిల్ సర్వీసెస్ లోకి వస్తున్నారని తెలిపారు. తీరా ఇందులోకి వచ్చాక అధికారిక పరిమితుల్లో ఇమడలేక నిరాశ చెందుతున్నారని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగంపైనా ఇదే రకమైన అపోహలు నెలకొన్నాయని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించగానే వారు, వారి కుటుంబం సమాజంలో ఉన్నత స్థానానికి చేరిపోయినట్లు భావిస్తున్నారని పేర్కొన్నారు. కలెక్టర్ అయినా ఐపీఎస్ అయినా.. హోదా ఏదైనా ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన అవకాశమేనని స్పష్టం చేశారు.
ఐఏఎస్ సాధించగానే తామేదో రాజులమైపోయామని భావించవద్దని హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో రాజులు ఎవరూ ఉండరన్నారు. ప్రధాన మంత్రో, రాష్ట్ర ముఖ్యమంత్రో రాజు, మహారాజులని అనుకోవడం మూర్ఖత్వానికి చిహ్నమని చెప్పారు. సివిల్ సర్వీసెస్ లో డబ్బు రాదని జయప్రకాశ్ నారాయణ్ చెప్పారు. ఇందులోకి వచ్చేందుకు పెట్టిన ఎఫర్ట్స్ ను బయట వేరే రంగంలో పెడితే గౌరవప్రదంగా, న్యాయంగా సంపాదించుకోవచ్చని వివరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ పదవికీ అపరిమిత అధికారం ఉండదని తేల్చిచెప్పారు. ప్రజలకు సేవ చేసే అవకాశమే తప్ప నిజాయతీగా డబ్బులు కూడబెట్టుకునేందుకు వీలుండదని ఆయన పేర్కొన్నారు. అధికార పరిమితులకు లోబడి, ఒళ్లు దగ్గరపెట్టుకుని ప్రజలకు సేవ చేయాలని సూచించారు.
సమాజానికి మంచి చేయడానికి సివిల్ సర్వెంట్ గా మారిన వాళ్లు కూడా తర్వాతి కాలంలో సమాజానికి ద్రోహులుగా మారారని జయప్రకాశ్ నారాయణ్ చెప్పారు. ప్రభుత్వంలో కూడా సమర్థులకు ఒక్కోసారి సరైన ప్రాధాన్యం, గుర్తింపు దక్కడంలేదని చెప్పారు. అసమర్థులను అందలం ఎక్కిస్తున్నారని, కాళ్లు పట్టుకున్న వారిని నెత్తిన కూర్చోబెట్టుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఇక కొందరు సివిల్ సర్వెంట్లలో అహంకారం పెరిగిపోతోందని, ఐఏఎస్ గొప్పంటే.. ఐపీఎస్ గొప్ప అని తగవులు పడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు వారిపై పెట్టిన బాధ్యతను మరిచి ఇలాంటి తగాదాలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని చెప్పారు.
ఏ రంగంలోనైనా సరే నిజాయతీ, సామర్థ్యం, చిత్తశుద్ధి, సంకల్పం.. ఈ ప్రమాణాలతో చూసినట్లైతే సమాజానికి పనికి వచ్చే వారు కేవలం వందకు పదిమంది మాత్రమే ఉంటారని జయప్రకాశ్ నారాయణ్ తేల్చిచెప్పారు. భారత దేశం వంటి పేద దేశంలో ఖరీదైన కార్లలో తిరగడానికి, కారు ముందు వెనకా పోలీస్ ఎస్కార్టును పెట్టుకోవడానికే సివిల్ సర్వీసెస్ అనే భావన యువతలో కలగడం ప్రమాదకరమని జయప్రకాశ్ నారాయణ్ హెచ్చరించారు. అలాంటి భావనను కనుక సివిల్ సర్వెంట్లు ప్రచారం చేయడం కంటే దేశానికి పెద్ద ద్రోహం మరొకటి లేదని అన్నారు.
‘సివిల్ సర్వెంట్లకు ప్రభుత్వంలో సంపాదన ఉండదు.. విశృంఖల అధికారం ఉండదు.. ప్రజాధనాన్ని ప్రజల కోసం ఖర్చు చేసే అవకాశం, అధికారం మాత్రమే వుంటాయి. ప్రజలకు సేవ చేయాలని నిజంగా తపన పడితే సివిల్ సర్వీసులకు ప్రయత్నం చేయండి. అంతే తప్ప గ్లామర్ కోసమో, డబ్బుల కోసమో ఇందులోకి వస్తే నిరాశ తప్పదు. మీకు ఉండాల్సింది ఆత్మగౌరవమే తప్ప అహంకారం కాదు’ అని జయప్రకాశ్ నారాయణ్ స్పష్టం చేశారు.