Kim Jong Un: కిమ్ బర్త్ డే ఎప్పుడు?.. ప్రపంచానికి ఇదో చిక్కు ప్రశ్న!

North Korea Supreme Chief Kim Turns 40

  • ఈ నెల 8న కిమ్ 40వ బర్త్ డే!
  • అదే నిజమైతే కిమ్ బర్త్ డే హంగామా లేదెందుకు?
  • కొన్ని లెక్కల ప్రకారం కిమ్ వయసు 44 ఏళ్లు
  • తండ్రి, తాతలా ఆర్భాటాలకు పోని కిమ్

ప్రపంచంలోని ఇతర దేశాధినేతలతో పోలిస్తే ఉత్తరకొరియా సుప్రీంచీఫ్ కిమ్ జోంగ్ ఉన్ విలక్షణ వ్యక్తి. తన చేష్టలతో నిత్యం ఉద్రిక్తతలు సృష్టిస్తూ ప్రపంచానికే శత్రువుగా మారిన కిమ్ 40వ పడిలోకి ప్రవేశించారా? అదే నిజమైతే దేశంలో ధూంధాంగా జరగాల్సిన వేడుకలకు సంబంధించిన హంగామా ఏమైంది? ఈ ప్రశ్నలు ఎవరికీ అంతుచిక్కడం లేదు. కిమ్ ఈ నెల 8తో 40వ పడిలోకి ప్రవేశించినట్టు తెలుస్తున్నా ఆయన బర్త్ డే వేడుకలు మాత్రం ఎక్కడా కనిపించకపోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కిమ్ దివంగత తండ్రి కిమ్ జోంగ్-యిల్, తాత కిమ్ II-సంగ్ మాత్రం తమ బర్డ్ డేను అంగరంగ వైభవంగా జరుపుకునేవారు. దేశానికి ముఖ్యమైన సెలవుగా ఆ రోజును ప్రకటించేవారు. కానీ, కిమ్ ఈ విషయంలో అలాంటి ఆర్భాటాలకు పోవడం లేదు.

40 కాదు.. 44
కిమ్ 1984లో పుట్టారని, కాబట్టి ఈ ఏడాదికి ఆయన వయసు 40 ఏళ్లకు చేరుకుంటుందని అమెరికా ప్రభుత్వం చెబుతోంది. అయితే, నార్త్ కొరియా మాత్రం కిమ్ సరిగ్గా ఎప్పుడు పుట్టారన్న విషయాన్ని బయటపెట్టడం లేదు. అయితే, కిమ్‌కు అత్యంత సన్నిహితుడైన కిమ్ క్యే-గ్వాన్ మాత్రం అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కిమ్ బర్త్ డేట్‌ను పంచుకున్నట్టు తెలిసింది. దీనిని బట్టి ఆయన జనవరి 8న జన్మించినట్టు చెబుతున్నారు. 2014లో నార్త్ కొరియా రాజధాని ప్యాంగాంగ్‌లో జరిగిన ఎగ్జిబిషన్ బాస్కెట్‌బాల్ మ్యాచ్‌లో డెన్నిస్ రోడ్‌మాన్.. త్వరలో 34వ జన్మదినం జరుపుకుంటున్న కిమ్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు. ఈ లెక్కన చూసుకుంటే కిమ్‌కు ఇప్పుడు 44 ఏళ్లు.

1982.. 83.. 84
కిమ్ సోమవారం కుమార్తె కిమ్ జు-ఎతో కలిసి చికెన్ ఫామ్‌ను సందర్శించారు. దక్షిణ కొరియా నిఘా వర్గాల సమాచారం ప్రకారం కిమ్ తర్వాత దేశ పగ్గాలు చేపట్టబోయేది కిమ్ జునే. కిమ్ బయటకు వచ్చారని అధికారిక పత్రిక పేర్కొన్నప్పటికీ ఆయన బర్త్ డేకు సంబంధించి మాత్రం ఎక్కడా పేర్కొనలేదు. కిమ్ ఏ సంవత్సరంలో జన్మించారన్న విషయంలో స్పష్టత లేకున్నప్పటికీ ‘కొరియా టైమ్స్’ మాత్రం 1982 లేదంటే 1983లో జన్మించి ఉండొచ్చని చెబుతోంది. అయితే, ప్రపంచం మాత్రం ఆయన 1984లో జన్మించి ఉంటారని నమ్మకంగా చెబుతోంది. సౌత్ కొరియా యూనిఫికేషన్ మంత్రిత్వశాఖ వెబ్‌సైట్ ప్రకారం కిమ్ 8 జనవరి 1984లో జన్మించారు. ఆ లెక్కన చూసుకుంటే ఆయన 40వ పడిలోకి ప్రవేశించినట్టే!

Kim Jong Un
North Korea
Birthday
USA
South Korea
Kim Ju-ae
  • Loading...

More Telugu News