Ambati Rambabu: దొంగ ఓట్లపై ఫిర్యాదు చేసేందుకు వెళుతూ దొంగ ఓటరును వెంట తీసుకెళ్లారు: ఏపీ మంత్రి అంబటి

Ambati slams Chandrababu

  • నేడు విజయవాడలో సీఈసీ సమావేశం
  • హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్
  • వారి వెంట దర్శనమిచ్చిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
  • వైసీపీని మోసం చేసిన శ్రీదేవి అంటూ అంబటి రాంబాబు విమర్శలు

కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విజయవాడలో నిర్వహించిన సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. ఏపీలో ఓట్ల అక్రమాలు జరుగుతున్నాయని సీఈసీకి ఫిర్యాదు చేశారు. వారివెంట తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా దర్శనమిచ్చారు. ఈ నేపథ్యంలో, ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలపై ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 

"మాజీ ముఖ్యమంత్రి, శాసనసభకు రానటువంటి ప్రధాన ప్రతిపక్ష నేత ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్లి కొన్ని విషయాలు  వివరించారు. ఆ సమావేశం అనంతరం వారు బయటికి వచ్చి వైసీపీని విమర్శిస్తూ మాట్లాడారు. మేం (వైసీపీ) అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నామని, దొంగ ఓట్లను ప్రోత్సహిస్తున్నామని ఆరోపణలు చేశారు. 

చాలా చిత్రమైన విషయం ఏమిటంటే... చంద్రబాబు ఈ సమావేశానికి... ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని మోసం చేసి, డబ్బు తీసుకుని టీడీపీకి ఓటేసిన తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిని వెంటబెట్టుకుని వెళ్లారు. దొంగ ఓట్లపై ఫిర్యాదు చేయడానికి దొంగ ఓటరును వెంటబెట్టుకుని వెళ్లారు. ఇది ఎంత దుర్మార్గమో నాకు అర్థం కావడంలేదు. 

వైసీపీలో ఫ్యాన్ గుర్తుపై గెలిచి, మొన్న జరిగిన శాసనమండలి ఎన్నికల్లో టీడీపీకి అమ్ముడుపోయి, చంద్రబాబు చెప్పిన మేరకు టీడీపీకి ఓటేసిన శ్రీదేవి వంటి వారిని వెంటబెట్టుకుని వెళ్లి మాపైనే ఫిర్యాదు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంపై గౌరవం ఉన్నట్టుగా నటిస్తున్నారు.

ఇంకా నయం... మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని, ఆనం రామనారాయణరెడ్డిని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా వెంటబెట్టుకుని వెళ్లుంటే బండారం బాగా బయటపడేది. నేను ఒకటే చెబుతున్నా... ఈ దేశంలో ప్రజాస్వామ్యంపై ఏమాత్రం నమ్మకంలేని నేత ఉన్నారంటే అది నూటికి నూరు శాతం చంద్రబాబే. ఆయనకు డబ్బు మీద, కుట్రలు, కుతంత్రాల మీద నమ్మకం ఉంటుంది. ఇవి చేస్తూ ఇంతవరకు ఎదిగిన వ్యక్తి చంద్రబాబు... ఆయన ప్రజాదరణతో ఎదిగిన వ్యక్తి కానే కాదు" అంటూ అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.

Ambati Rambabu
Chandrababu
Undavalli Sridevi
Pawan Kalyan
CEC
Vijayawada
YSRCP
TDP
Janasena
Andhra Pradesh
  • Loading...

More Telugu News