Kesineni Nani: కేశినేని భవన్ కు ఉన్న చంద్రబాబు ఫ్లెక్సీలు, ఫొటోల తొలగింపు

Chandrababu flexis and photos removed in Kesineni Bhavan
  • కేశినేని నానికి ఎంపీ టికెట్ లేదన్న పార్టీ హైకమాండ్
  • పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన నాని
  • కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసిన ఆయన కూతురు శ్వేత
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానికి ఈసారి టికెట్ లేదని పార్టీ అధిష్ఠానం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేశినేని నాని తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఆయన కూతురు కేశినేని శ్వేత టీడీపీ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. కేశినేని నాని కూడా లోక్ సభ స్పీకర్ ను కలిసి తన రాజీనామా లేఖను అందజేస్తానని చెప్పారు. స్పీకర్ అపాయింట్ మెంట్ ను కోరానని తెలిపారు. ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానని చెప్పారు. 

ఢిల్లీకి చేరుకోవడానికి ఒక ఫ్లైట్ మిస్సయితే మరో ఫ్లయిట్ ఉంటుందని... అది కూడా లేకపోతే ప్రైవేట్ జెట్ లో వెళ్లొచ్చని నాని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో, ఆయన పార్టీ మారబోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. మరోవైపు, విజయవాడలోని కేశినేని భవన్ వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్లెక్సీలు, ఫొటోలను తొలగించారు. వీటి స్థానంలో దివంగత ఎన్టీఆర్, కేశినేని నాని, కేశినేని శ్వేతల ఫొటోలను ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలను మారుస్తున్న దృశ్యాలను స్థానికులు ఆసక్తికరంగా గమనించారు.
Kesineni Nani
Kesineni Swetha
Chandrababu
Telugudesam
Kesineni Bhavan

More Telugu News