YSRCP: వైసీపీలో బుజ్జగింపుల పర్వం షురూ.. జగన్ నచ్చజెప్పినా నిర్ణయం మార్చుకోని పార్థసారథి!
- వైసీపీ సాధికార బస్సుయాత్రలో అసంతృప్తి వెళ్లగక్కిన పార్థసారథి
- జగన్ గుర్తించకపోయినా ప్రజలు తనతోనే ఉన్నారన్న పెనమలూరు ఎమ్మెల్యే
- పార్థసారథిని జగన్ వద్దకు తీసుకెళ్లిన ఎమ్మెల్యే
నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల మార్పుతో వైసీపీలో హీటెక్కిన అసంతృప్తి తీవ్రరూపం దాల్చుతోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదని తెలిసిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో బుజ్జగింపుల పర్వం మొదలైంది.
పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని జగన్ నిన్న తన కార్యాలయానికి పిలిపించి 20 నిమిషాలకుపైగా మాట్లాడారు. పార్టీని వీడొద్దని, సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ ఆయన ముుభావంగానే ఉన్నట్టు సమాచారం.
వైసీపీ సాధికార బస్సు యాత్రలో పార్థసారథి ఇటీవల అందరిముందు తన అసంతృప్తిని వెళ్లగక్కారు. జగన్ తనను గుర్తించకపోయినా పెనమలూరు ప్రజలు మాత్రం తనకు ఎప్పుడూ మద్దతుగానే ఉన్నారని పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఊహాగానాలకు కారణమయ్యాయి. ఆయన పార్టీని వీడబోతున్నారంటూ ప్రచారం మొదలైంది.
ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్.. జగన్ సూచనతో పార్థసారథికి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే నిన్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, అనిల్ కలిసి పార్థసారథిని ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లారు. అయితే, జగన్‌తో చర్చల తర్వాత కూడా పార్థసారథి అసంతృప్తిగానే ఉన్నారని, పార్టీ వీడాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.