Youtube: పచ్చని సంసారంలో యూట్యూబ్ జ్యోతిషం చిచ్చు.. గృహిణి ఆత్మహత్య

Wife suicide after believe youtube astrology
  • యూట్యూబ్‌లో చెప్పినట్టుగా తాము విడిపోతామని నమ్మిన గృహిణి
  • అలాంటివి నమ్మొద్దంటూ నచ్చజెప్పిన భర్త
  • వాగ్వివాదం జరగడంతో అందరి ముందు భార్యపై చేయిచేసుకున్న భర్త
  • మనస్తాపంతో ఉరివేసుకున్న భార్య
పచ్చని సంసారంలో యూట్యూబ్ జ్యోతిషం చిచ్చుపెట్టింది. గృహిణి ఆత్మహత్యకు కారణమైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ అంబర్‌పేటకు చెందిన బబిత (28)కు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రామకృష్ణ అలియాస్ రాము (30)తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. కానాజీగూడ ఇందిరానగర్‌లో కాపురం పెట్టిన దంపతులకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. జ్యోతిష్యాన్ని విపరీతంగా నమ్మే బబిత ఓ యూట్యూబ్‌లో చెప్పిన జ్యోతిష్యం విని, అందులో చెప్పినట్టుగా తాము విడిపోతామని బలంగా నమ్మింది. ఇదే విషయాన్ని భర్తతో తరచూ చెప్తే ఆయన కొట్టిపడేసేవాడు.

ఈ క్రమంలో ఆదివారం నిర్వహించిన కుమారుడి బర్త్డే వేడుకకు బంధుమిత్రులందరూ హాజరయ్యారు. బబిత తల్లిదండ్రులు మాత్రం రాలేదు. సోమవారం ఉదయం రాము విధులకు వెళ్లగా, కుమారుడు అంగన్‌వాడీకి వెళ్లాడు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అంగన్‌వాడీ కేంద్రం నుంచి వచ్చిన చిన్నారికి తల్లి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని కనిపించడంతో కంగారుపడిపోయాడు. వెంటనే కింది పోర్షన్‌లో ఉండే బాబాయికి చెప్పడంతో ఆయన వచ్చి ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించాడు.

అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలిసిన బబిత తల్లిదండ్రులు రాముపై దాడి చేశారు. అదనపు కట్నం కోసం వేధించడం వల్లే కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. అయితే, జ్యోతిష్యాన్ని నమ్మే ఆమె ఆత్మహత్య చేసుకుందని, దానిని నమ్మవద్దని తాను పదేపదే చెప్పేవాడినని రాము చెప్పాడు. ఇటీవల ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకోవడంతో ఆగ్రహం పట్టలేని రాము భార్యపై అందరిముందు చేయిచేసుకున్నాడు. దీంతో ఆమె మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Youtube
Astrology
Suicide
Youtube Astrology

More Telugu News