Lagadapati Rajagopal: రాజమండ్రిలో ప్రత్యక్షమైన లగడపాటి
- రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా లగడపాటి
- గత పదేళ్లుగా మీడియా ముందుకు రాని వైనం
- రాజమండ్రిలో మాజీ ఎంపీ హర్షకుమార్ నివాసానికి వెళ్లిన లగడపాటి
- తాను రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తేలేదని వెల్లడి
రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరమైన కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తాజాగా రాజమండ్రిలో ప్రత్యక్షమయ్యారు. ఇవాళ ఆయన మాజీ ఎంపీ హర్షకుమార్ నివాసానికి వచ్చారు. ఆయనతో కాసేపు చర్చించారు.
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఏపీ కాంగ్రెస్ లో ఉత్సాహం కనిపిస్తుండగా, ఇప్పుడు లగడపాటి తెరపైకి రావడంతో ఆసక్తి కలిగించింది. లగడపాటి మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారా అనే చర్చ మొదలైంది. దీనిపై ఆయనను మీడియా ప్రశ్నించింది. తాను మళ్లీ రాజకీయాల్లోకి రాబోవడంలేదని లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. ఓ శుభకార్యం కోసం కాకినాడ వెళుతూ మార్గమధ్యంలో రాజమండ్రిలో ఆగానని, హర్షకుమార్ ను మర్యాదపూర్వకంగానే కలిశానని వివరించారు.
గతంలో ప్రజల పక్షాన నిలిచి కాంగ్రెస్ కు దూరమయ్యానని పేర్కొన్నారు. అప్పుడే తన రాజకీయ జీవితం ముగిసిందని అన్నారు.
అయితే తనకు రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఆనందం కలిగించిందని అన్నారు. హర్షకుమార్ తో భేటీ అనంతరం లగడపాటి... మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నివాసానికి వెళ్లారు. తాను ఎప్పుడు రాజమండ్రి వచ్చినా ఉండవల్లి, హర్షకుమార్ లను కలుస్తుంటానని లగడపాటి చెప్పారు. హర్షకుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్ ఎక్కడ్నించి పోటీ చేసినా వాళ్లకు మద్దతుగా ప్రచారం చేస్తానని చెప్పారు.