Parshottam Rupala: చిలికా సరస్సులో చిక్కుకుపోయిన కేంద్రమంత్రి ప్రయాణిస్తున్న బోటు
- సాగర పరిక్రమ కార్యక్రమంలో భాగంగా మత్స్యకారులను కలిసేందుకు వచ్చిన మంత్రి పర్షోత్తమ్ రూపాల
- బార్కుల్ నుంచి సాతపదకు సరస్సు మీదుగా వెళ్తుండగా ఘటన
- మరో బోటు పంపి రక్షించిన అధికారులు
కేంద్ర మత్స్య, పశు సంరక్షణశాఖ మంత్రి పర్షోత్తమ్ రూపాల ప్రయాణిస్తున్న బోటు ఒడిశాలోని చిలికా సరస్సులో దాదాపు రెండుగంటలపాటు చిక్కుకుపోయింది. బోటు తొలుత మత్స్యకారులు వేసిన వలలో చిక్కుకుపోయిందని భావించారు. అయితే, అదేం లేదని బ్లూ లాగూన్ (లోతు లేని నీలిమడుగు) దారిలో తప్పిపోయినట్టు మంత్రి వివరణ ఇచ్చారు.
విషయం తెలిసిన అధికారులు వెంటనే మరో బోటు పంపించి మంత్రిని వెనక్కి తీసుకొచ్చారు. ‘సాగర పరిక్రమ’ కార్యక్రమం 11వ దశలో భాగంగా మత్స్యకారులను కలిసి మాట్లాడేందుకు మంత్రి ఒడిశా సందర్శించారు. చిక్కుకుపోయిన బోటులో మంత్రితోపాటు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా, స్థానిక నాయకులు కూడా ఉన్నారు. మంత్రి ఖుర్దా జిల్లాలోని బార్కుల్ నుంచి పూరి జిల్లాలోని సాతపదకు సరస్సు మీదుగా వెళ్తుంగా ఈ ఘటన చోటుచేసుకుంది.