Prajapalana: ప్రజాపాలనపై నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

CM Revanth reddy review meeting on prajapalana
  • నేటి ఉదయం 11.00 గంటలకు సీఎం అధ్యక్షతన సమావేశం
  • సమావేశానికి అందుబాటులో ఉన్న మంత్రుల హాజరు
  • అభయ హస్తం దరఖాస్తుల పరిష్కారం, నిధుల సేకరణపై సమీక్ష
ప్రజాపాలన ముగిసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంపై నేడు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11.00 గంటలకు సీఎం అధ్యక్షతన జరగనున్న సమావేశంలో మంత్రులు కూడా పాల్గొంటారు. అయితే, ఇది అధికారిక మంత్రివర్గ సమావేశం కాదని, అందుబాటులో ఉన్న మంత్రులు ఈ సమావేశానికి హాజరుకావాలని కోరినట్టు తెలుస్తోంది. 

ప్రజాపాలన సాగిన తీరుపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు. ప్రజలు ఎక్కువగా ఏ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు? వాటి అమలు, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తదితరాలపై చర్చించనున్నారు. దరఖాస్తుల డిజిటలీకరణ, ప్రాసెసింగ్‌కు అవసరమైన నిధుల సమీకరణ వంటివాటిపై కూడా ఈ సమావేశంలో దృష్టి సారిస్తారు. 

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న ఆరోపణలు, ఛత్తీగఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్రాజెక్టుల్లో అవకతవకలపై న్యాయవిచారణ కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడంపై కూడా ముఖ్యమంత్రి ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రభుత్వ నెల రోజుల పాలన, ప్రతిపక్షాల ఆరోపణలపై ప్రతిదాడికి సంబంధించిన అంశాలను కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

గత నెల 28 నుంచి ఈ నెల 6 వరకూ ప్రజాపాలన కార్యక్రమం జరిగింది. మొత్తం 8 రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో 1.11  కోట్ల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ప్రభుత్వానికి మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. అభయహస్తం గ్యారెంటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులు, ఇతర అంశాలకు సంబంధించి 19,92,747 దరఖాస్తులు వచ్చాయి.
Prajapalana
Revanth Reddy
Congress
Abhyahastam Guarantees

More Telugu News