Annapoorani: రాముడ్ని కించపరిచేలా ఉందంటూ... నయనతార కొత్త సినిమాపై ఫిర్యాదు

Nayanthara new stepped into troubles

  • నయనతార కొత్త చిత్రం అన్నపూర్ణి
  • నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
  • హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు

దక్షిణాది అగ్ర హీరోయిన్ నయనతార నటించిన అన్నపూర్ణి చిత్రం గత కొన్నిరోజులుగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ నిర్మించింది. అయితే ఈ సినిమాలో రాముడ్ని కించపరిచే సన్నివేశాలు ఉన్నాయంటూ శివసేన మాజీ నేత రమేశ్ సోలంకి ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అన్నపూర్ణి చిత్రంలోని కొన్ని సీన్లు హిందువుల సెంటిమెంట్లను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాదు, ఈ చిత్రం లవ్ జిహాద్ ను బలపరిచేలా ఉందని రమేశ్ సోలంకి విమర్శించారు. అన్నపూర్ణి చిత్ర  నిర్మాతలపైనా, ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తున్న ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ పైనా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. 

ఈ చిత్రంలో ఓ హిందూ పూజారి కుమార్తె నమాజు చదవడం, బిర్యానీ వండడం చూపించారని రమేశ్ సోలంకి వెల్లడించారు. ఇందులో ఫర్హాన్ (నటుడు) ఓ నటిని మాంసం తినాలని కోరతాడని, శ్రీరాముడు కూడా మాంసాహారేనని ఆమెతో చెబుతాడని వివరించారు. 

త్వరలో అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ట జరగనుండడంతో జీ స్టూడియోస్, నెట్ ఫ్లిక్స్ సంస్థలు ఉద్దేశపూర్వకంగానే ఈ చిత్రాన్ని తీసుకువచ్చాయని రమేశ్ సోలంకి ఆరోపించారు. 

ఈ నేపథ్యంలో... నీలేశ్ కృష్ణ (అన్నపూర్ణి దర్శకుడు), జై (నటుడు), నయనతార, జతిన్ సేథీ (నాడ్ స్టూడియోస్), ఆర్.రవీంద్రన్ (ట్రైడెంట్ ఆర్ట్స్), పునీత్ గోయెంకా (జీ స్టూడియోస్), షరీఖ్ పటేల్, మోనికా షేర్ గిల్ (నెట్ ఫ్లిక్స్ ఇండియా)లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రమేశ్ సోలంకి పోలీసులను కోరారు.

Annapoorani
Nayanthara
Hindu
Ramesh Solanki
Mumbai
Police

More Telugu News