Mallu Bhatti Vikramarka: ఇందిరమ్మ రాజ్యం దిశగా అడుగులు వేస్తున్నాం: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
- ఖమ్మం జిల్లాలో ప్రజాపాలన - అభయహస్తం కార్యక్రమంలో పాల్గొన్న భట్టి
- సంపదను సృష్టించి పేదలకు పంచుతామని వెల్లడి
- బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో అప్పుల రాష్ట్రంగా మార్చిందని విమర్శ
తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తీసుకువస్తామని హామీ ఇచ్చామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులో ప్రజాపాలన - అభయహస్తం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మల్లు భట్టి మాట్లాడుతూ... ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చామని... ఆ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. సంపదను సృష్టించి దానిని పేదలకు పంచుతామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే 'మహాలక్ష్మి'ని అమలు చేశామని వెల్లడించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు గుర్తు చేశారు. ఆరు గ్యారెంటీల అమలుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. విభజన తర్వాత సర్ ప్లస్‌గా ఉన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ తన పదేళ్ల కాలంలో అప్పుల రాష్ట్రంగా మార్చిందని ఆరోపించారు.