Temple Gate: ట్రాఫిక్ కోసం ఢిల్లీలో ఆలయం గేట్ కూల్చివేత.. వీడియో ఇదిగో!
- ఎల్జీ పిలుపుతో స్పందించి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ఆలయ కమిటీ
- ట్విట్టర్ లో వీడియో షేర్ చేసి ధన్యవాదాలు తెలిపిన ఎల్జీ
- ఢిల్లీలోని రాణి ఝాన్సీ మార్గ్ లో ఝండేవాలన్ మందిర్
పాదచారుల రాకపోకలకు అసౌకర్యంగా ఉందని ఢిల్లీలోని ఓ ఆలయం గేట్ ను కమిటీ సభ్యులే కూల్చివేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అభ్యర్థన మేరకు ఆలయ కమిటీ స్వచ్ఛందంగా ఈ పని చేసింది. గేట్ కూల్చివేయడంతో పాదచారుల రాకపోకలు సాఫీగా సాగడంతో పాటు ట్రాఫిక్ చికాకులు తప్పుతాయని ఎల్జీ ట్వీట్ చేశారు. తన అభ్యర్థనను మన్నించినందుకు ఆలయ కమిటీకి సక్సేనా కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు ఆలయం గోడ కూల్చివేతకు సంబంధించిన వీడియోను ఎల్జీ సక్సేనా ట్విట్టర్ లో పంచుకున్నారు.
ఢిల్లీలోని రాణి ఝాన్సీ మార్గ్ లోని పురాతన ఆలయం ఝండేవాలన్ మందిర్.. ఈ ఆలయం ముందున్న గేట్ వల్ల పాదచారుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. నార్త్, సౌత్ ఢిల్లీలను కలిపే ప్రధాన మార్గం కావడంతో తరచూ ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా ఈ గేట్ తొలగించాలంటూ ఇటీవల ఆలయ కమిటీకి విజ్ఞప్తి చేశారు. ఎల్జీ విజ్ఞప్తిపై ఆలయ కమిటీ చర్చించి, గేటును తొలగించాలని నిర్ణయం తీసుకుంది.