Giriraj Singh: మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వంతో పోల్చిన కేంద్రమంత్రి
- ఈడీ బృందంపై టీఎంసీ నేత మద్దతుదారుల దాడి
- అక్కడ ప్రజాస్వామ్యమన్నదే లేదన్న కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్
- రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్ డిమాండ్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వాన్ని కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్ ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వంతో పోల్చారు. ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్యమన్నదే లేదని దుమ్మెత్తి పోశారు. రేషన్ పంపిణీ కుంభకోణం ఆరోపణపై తనిఖీలకు వెళ్లిన ఈడీ బృందంపై రాష్ట్రంలో దాడి నేపథ్యంలో ఆయనీ ఘాటు విమర్శలు చేశారు.
‘‘పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యం అనేదే లేదు. అక్కడ కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం ఉన్నట్టుంది. హత్య జరిగినా అక్కడది కొత్త విషయం కాదని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి అన్నారు. ఇది మమతా బెనర్జీ ప్రజాస్వామ్యం’’ అని పాట్నాలో విలేకరులతో మాట్లాడుతూ గిరిరాజ్ పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో తనిఖీలకు వెళ్తున్న సమయంలో ఈడీ అధికారుల బృందంపై టీఎంసీ నేత షాజహాన్ షేక్ మద్దతుదారులు దాడిచేశారు. వారు ప్రయాణిస్తున్న వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో గాయపడిన అధికారులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఈ ఘటన తర్వాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.