Pavala Shyamala: దయనీయ స్థితిలో నటి పావలా శ్యామల... ఆర్థికసాయం అందించిన కాదంబరి కిరణ్

Kadambari Kiran helps actress Pavala Shyamala

  • క్యారెక్టర్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న పావలా శ్యామల
  • గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వైనం
  • ప్రత్యక్షంగా ఆమె పరిస్థితి చూసి చలించిపోయిన కాదంబరి కిరణ్
  • 'మనం సైతం' ఫౌండేషన్ ద్వారా ఆర్థికసాయం

తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ నటిగా, మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటిగా గుర్తింపు తెచ్చుకున్న పావలా శ్యామల ప్రస్తుతం దయనీయ స్థితిలో బతుకు వెళ్లదీస్తున్నారు. ఆదుకునేవారు లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, నేనున్నానంటూ నటుడు కాదంబరి కిరణ్ ముందుకొచ్చారు. 'మనం సైతం ఫౌండేషన్' ద్వారా పావలా శ్యామలకు ఆర్థికసాయం అందించారు. కాదంబరి కిరణ్ తాజాగా సీనియర్ నటి పావలా శ్యామల నివాసానికి వచ్చారు. అప్పటికే ఆమె పరిస్థితి తెలుసుకున్న ఆయన... ప్రత్యక్షంగా చూసి చలించిపోయారు. అక్కడికక్కడే చెక్ రాసి ఇచ్చారు. 

ఈ సందర్భంగా పావలా శ్యామల... కాదంబరి కిరణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. తన గుండెకు మూడు రంధ్రాలు పడ్డాయని, కిడ్నీలో ఇన్ఫెక్షన్ సోకిందని డాక్టర్లు చెప్పారని, పైగా తనకు పార్కిన్సన్ వ్యాధి కూడా ఉందని శ్యామల చెప్పారు. ఉన్నట్టుండి కాళ్లు కూడా చచ్చుపడిపోయాయని వెల్లడించారు. 

తాను ఉన్నానో లేదో అని కూడా ఎవరూ పట్టించుకోవడంలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన వద్ద ఎవరి ఫోన్ నెంబర్లు లేవని, కానీ కాదంబరి కిరణ్ ఎప్పటినుంచో తెలుసని, ఆయన తన కోసం వచ్చి సాయం అందించారని భావోద్వేగంతో వివరించారు.

More Telugu News