Ship Hijack: సోమాలియా తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌక హైజాక్
- హైజాక్ సమాచారాన్ని యూకే మారిటైమ్ ఏజెన్సీకి పంపిన నౌక
- రంగంలోకి దిగిన ఇండియన్ నేవీ
- ఐఎన్ఎస్ చెన్నైతోపాటు ఎయిర్‌క్రాఫ్ట్‌ను పంపిన నేవీ
- సిబ్బంది క్షేమంగానే ఉన్నారన్న అధికారులు
హిందూ మహాసముద్రంలోని సోమాలియా తీరంలో లైబీరియా జెండాతో ఉన్న నౌక హైజాక్ అయింది. ఇందులో 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్టు తెలిసింది. హైజాక్ సమాచారాన్ని గురువారం సాయంత్రం యూకే మారిటైమ్ ఏజెన్సీకి నౌక సందేశం పంపింది. గుర్తుతెలియని సాయుధులు నౌకలోకి ప్రవేశించి హైజాక్ చేసినట్టు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న భారత నేవీ ఐఎన్ఎస్ చెన్నైని మోహరించడంతోపాటు ఎయిర్‌క్రాఫ్ట్‌ను కూడా రంగంలోకి దింపింది. నౌకలోని సిబ్బందితో కమ్యూనికేషన్ ఏర్పడిందని, వారంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో వరసపెట్టి నౌకలపై దాడులు చేస్తున్న వేళ.. హిందూ మహాసముద్రంలోనూ దుండగులు తెగబడుతున్నారు. ఇటీవల భారత్ వస్తున్న ఓ వాణిజ్య నౌకపై గుజరాత్ తీరంలో డ్రోన్ దాడి జరిగింది. ఆ ఘటన నుంచి 20 మంది భారతీయులు సహా సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు.