Eagle: సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న రవితేజ 'ఈగల్'

Ravi Teja Eagle release postponed

  • ఈసారి సంక్రాంతి సీజన్ లో పెద్ద సినిమాల సందడి
  • 'గుంటూరు కారం'తో మహేశ్ బాబు, 'సైంధవ్'తో వెంకటేశ్ సందడి 
  • 'నా సామిరంగ' అంటూ వస్తున్న నాగార్జున
  • ఫిబ్రవరి 9కి వాయిదా పడిన 'ఈగల్' రిలీజ్ డేట్

సంక్రాంతి పండుగ అంటే తెలుగువాళ్లకు ఎంత ప్రత్యేకమో చెప్పనక్కర్లేదు. కొత్త బట్టలు, కోడిపందాలు, పిండివంటలు, కొత్త సినిమాలు... ఇలా చెప్పుకుంటూ పోతే సంక్రాంతి పండుగ విశేషాలు చాలానే ఉంటాయి. సినీ రంగానికి కూడా సంక్రాంతి ఒక సెంటిమెంట్ గా మారిపోయింది. ఈ పండుగకు తమ సినిమాలు విడుదల చేయాలని ప్రతి ఒక్క హీరో, దర్శకుడు, నిర్మాత భావిస్తారంటే అతిశయోక్తి కాదు.

ఈసారి కూడా సంక్రాంతి బరిలో పలువురు అగ్రహీరోల సినిమాలు ఉన్నాయి. అయితే, డేట్స్ క్లాష్ రావడంతో మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఈగల్' చిత్రం సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. ఈ చిత్ర నిర్మాతలు విడుదల తేదీని వాయిదా వేసుకున్నారు. 

వాస్తవానికి ఈగల్ చిత్రం జనవరి 13న రిలీజ్ కావాల్సి ఉంది. అదే రోజున విక్టరీ వెంకటేశ్ సైంధవ్ రిలీజ్ అవుతోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు గుంటూరు కారం జనవరి 12న వస్తుండగా... అదే రోజున తేజా సజ్జా నటించిన హను-మాన్ విడుదలవుతోంది. నాగార్జున నటించిన నా సామిరంగ చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 

ఈ నేపథ్యంలో, ఇవాళ తెలుగు ఫిలిం చాంబర్, తెలంగాణ ఫిలిం చాంబర్, తెలుగు నిర్మాతల మండలి సమావేశమై సినిమాల విడుదల తేదీలపై చర్చించాయి. వెంటవెంటనే పెద్ద సినిమాలు రిలీజ్ అయితే, ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయన్నది ప్రముఖంగా చర్చకు వచ్చింది. ఈ సమావేశంలో దిల్ రాజు, దామోదర ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. 

ఈ క్రమంలో, తమ చిత్రాన్ని వాయిదా వేసుకునేందుకు ఈగల్ చిత్ర నిర్మాతలు అంగీకరించారు. ఈగల్ చిత్రాన్ని ఫిబ్రవరి 9న రిలీజ్ చేసేందుకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్ణయించుకుంది. 

దిల్ రాజు దీనిపై స్పందిస్తూ... ఒక సినిమా వెనక్కి తగ్గినంత మాత్రాన ఏదో జరిగినట్టు భావించరాదని, ఇది తామందరం కలిసి తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు. దామోదర ప్రసాద్ స్పందిస్తూ, ఈగల్ చిత్ర నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

Eagle
Ravi Teja
Release Date
Postpone
Sankranthi
Andhra Pradesh
Telangana
Tollywood
  • Loading...

More Telugu News