gangula kamalakar: మా పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి ఎవరూ వెళ్లరు.. మేం గేట్లు తెరిస్తే వాళ్లే బీఆర్ఎస్‌లోకి వస్తారు: గంగుల కమలాకర్
- కాంగ్రెస్ పార్టీ నుంచే బీఆర్ఎస్‌లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తోందని వ్యాఖ్య
- కాంగ్రెస్ మా నుంచి ఒకరిని తీసుకువెళితే.. మా పార్టీలోకి పది మంది వస్తారన్న గంగుల
- బీఆర్ఎస్‌ను సంస్థాగతంగా మరింత బలోపేతం చేసే అంశంపై చర్చిస్తున్నామన్న మాజీ మంత్రి
బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరూ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరరని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గురువారం అన్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం నేపథ్యంలో ఆయన స్పందించారు. ఆయన హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... తమ పార్టీ నుంచి ఎవరూ కూడా కాంగ్రెస్‌లోకి వెళ్లే ప్రసక్తి లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచే బీఆర్ఎస్‌లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తోందన్నారు. తాము గేట్లు తెరిస్తే కనుక చాలామంది కాంగ్రెస్ నేతలు తమ పార్టీలోకి వస్తారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కనుక తమ పార్టీ నుంచి ఒకరిని తీసుకువెళ్తే... ఆ పార్టీ నుంచి మా పార్టీలోకి పదిమంది వస్తారని చెప్పారు. బీఆర్ఎస్‌ను సంస్థాగతంగా మరింత బలోపేతం చేసే అంశంపై పార్టీలో చర్చిస్తున్నట్లు తెలిపారు.
కరీంనగర్ నియోజకవర్గ ప్రతినిధులతో సమావేశం
రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో.. తెలంగాణ భవన్‌లో ఈ రోజు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, మాజీ ఎంపీ వినోద్ కుమార్, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ముఖ్య నేతలు పాల్గొన్నారు.