Jitendra Awhad: 'రాముడు మాంసాహారి' వ్యాఖ్యలపై ఎన్సీపీ నేత క్షమాపణలు
- రామాయణంలో ఉన్న విషయాన్నే తాను చెప్పానన్న జితేంద్ర అవహద్
- పరిశోధించకుండా ఏ విషయం గురించీ మాట్లాడనన్న ఎన్సీపీ నేత
- తన వ్యాఖ్యలు బాధించి ఉంటే క్షమించాలని వేడుకోలు
శ్రీరాముడు మాంసాహారి అంటూ చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి జితేంద్ర అవహద్ క్షమాపణలు చెప్పారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో దిగివచ్చిన ఆయన క్షమాపణలు చెబుతూ.. ఏ విషయం గురించీ తాను తొందరపడి మాట్లాడనని, రామాయణంలో ఉన్న దానినే చెప్పానని పేర్కొన్నారు.
షిర్డీలో నిన్న జితేంద్ర మాట్లాడుతూ.. రాముడు శాకాహారి కాదు.. మాంసాహారి. 14 ఏళ్లు వనవాసం చేసిన రాముడికి శాకాహారం ఎక్కడ దొరుకుతుంది? అవునా? కాదా? అని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాముడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేతలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో స్పందించిన జితేంద్ర తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని వేడుకున్నారు. పరిశోధించకుండా తాను దేని గురించీ మాట్లాడనని, ఏది ఏమైనా ఈ విషయాన్ని మరింత తీవ్రం చేయాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు.