Chandrababu: నా ఎస్సీ, ఎస్టీలు అంటూనే జగన్ వారినే మార్చేస్తున్నాడు: చంద్రబాబు

Chandrababu naidu criticizes jagan over his governance policies

  • మంగళగిరిలో ఎన్టీఆర్ భవన్‌ వేదికగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగం
  • జగన్ పాలనపై విమర్శలు గుప్పించిన టీడీపీ అధినేత
  • రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చే పరిస్థితి లేదని వ్యాఖ్య
  • చారిత్రాత్మకమైన రిషికొండను తవ్వి ప్యాలెస్ కట్టారని ఆగ్రహం

ఏపీ సీఎం జగన్ పాలనను టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు ఎండగట్టారు. బుధవారం మంగళగిరిలో ఎన్టీఆర్ భవన్‌ వేదికగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చే పరిస్థితి లేదని, రాష్ట్రానికి ఎవరు రావాలన్నా భయపడుతున్నారని అన్నారు. రిషి కొండ లాంటి చారిత్రక కొండను తవ్వి ప్యాలెస్ కట్టుకున్నాడని విమర్శించారు. రాష్ట్రానికి సీఎంగా జగన్ శాశ్వతంగా ఉంటాడా అని విమర్శించారు. 

‘‘రాజకీయాలకు నూతన నిర్వచనం నేర్పిన వ్యక్తి ఎన్టీఆర్
తెలుగుజాతి బతికున్నంతకాలం గుర్తుండే వ్యక్తి ఎన్టీఆర్. 60 ఏళ్ల వయసు తర్వాత ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు..ఆయన జీవితం ఒక  ఆదర్శం. పదవి, డబ్బులు కోసం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాలేదు. తనను ఆదరించిన ప్రజలకు సేవ చేయాలని, నీతివంతమైన రాజకీయం చేయాలని వచ్చి రాజకీయాలకే నూతన నిర్వచనం నేర్పించారు ఎన్టీఆర్. అభివృద్ధి-సంక్షేమాన్ని పద్ధతిప్రకారం నడిపించారు. రిషికొండ లాంటి చారిత్రక కొండను తవ్వేసి, ప్యాలెస్ కట్టేశాడు. ఈయనే సీఎంగా శాశ్వతంగా ఉంటాడనుకున్నారు. రూ.500 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకుని ఏ విధంగా సమర్థించుకుంటావు? మా ఇంటికి వంద గజాల చిన్న రోడ్డు వేస్తే ప్రతి రోజూ విమర్శించిన వ్యక్తి...తన ఇంటికి 4 లైన్ల రోడ్డు వేసుకున్నాడు. రాజధాని విశాఖ తీసుకెళ్తానంటే కోర్టులు కూడా మొట్టికాయలు వేశాయి. కానీ రాజధాని పేరుతో విశాఖ ప్రజలను మోసం చేశాడు. సాధ్యం కాదని తెలిసి కూడా వందల కోట్లు లాయర్లకు విచ్చలవిడిగా డబ్బులిచ్చి దుర్వినియోగం చేశాడు’’ 

నా ఎస్సీ, నా ఎస్టీలు అంటూ...వారినే మార్చేస్తున్నాడు
మొన్న 11 మందిని, నిన్న 27 మందిని మార్చాడు. నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటాడు..కానీ వారినే మార్చాడు. నేను పుల్లను నిలబెట్టినా గెలుస్తారు అన్నావ్ కదా...మరి ఇప్పుడున్నవాళ్లను పెట్టి ఎందుకు గెలిపించలేవు? సీఎం పదవి కోసం నేను ప్రయత్నం చేయడం లేదు. టీడీపీ-జనసేన అధికారం కోసం ప్రయత్నం చేయడం లేదు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం పోరాటం చేస్తున్నాం. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలొచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రానికి ఎవరన్నా రావాలన్నా భయపడిపోతున్నారు. ఆస్తులను రాసిస్తావా లేదా అని మెడపై కత్తిపెట్టి రాయించుకుంటున్నారు’’ 

‘‘విశాఖలో యువతిపై 11 మంది గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? శాంతి భద్రతల గురించి సీఎం పట్టించుకుంటున్నాడా? నేను సీఎంగా ఉన్నప్పుడు పిడుగురాళ్లలో అత్యాచారం జరిగితే టాస్క్ ఫోర్స్ కమిటీ వేసి నిందితుడు భూమ్మీద ఎక్కడున్నా పట్టుకురమ్మంటే.. విషయం తెలుసుకున్న నిందితుడు ఉరేసుకుని చనిపోయాడు. పాలకులు సమర్థులుగా ఉంటే మిగిలిన వాళ్లు ఒళ్లు దగ్గరపెట్టుకుని పని చేస్తారు. డ్రగ్స్ గురించి మాట్లాడితే విమర్శలు చేస్తారా అని టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు’’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News