Adani Group: అదానీకి భారీ ఊరట.. హిండెన్ బర్గ్ వివాదంలో సిట్ విచారణకు నో చెప్పిన సుప్రీంకోర్టు
- సెబీ దర్యాఫ్తుపై విశ్వాసం ప్రకటించిన సుప్రీం
- మీడియా రిపోర్టులపై ఆధారపడలేమంటూ కామెంట్
- దర్యాఫ్తును 3 నెలల్లో పూర్తిచేయాలంటూ సెబీకి ఆదేశం
అదానీ గ్రూప్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. హిండెన్ బర్గ్ వివాదంలో అదానీ గ్రూప్ కు సెబీ క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిని అత్యున్నత న్యాయస్థానం కూడా సమర్థించింది. హిండెన్ బర్గ్ నివేదికపై సెబీ దర్యాఫ్తులో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. సెబీ దర్యాఫ్తుపై విశ్వాసం ప్రకటించిన సుప్రీంకోర్టు.. ఈ కేసులో సిట్ దర్యాఫ్తు అవసరంలేదని స్పష్టంచేసింది. కేసు బదిలీకి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. హిండెన్ బర్గ్ నివేదికపై మిగతా దర్యాఫ్తును మూడు నెలల్లో పూర్తిచేయాలని సెబీని ఆదేశించింది. ఈ వ్యవహారంలో మీడియా రిపోర్టులపై ఆధారపడలేమని వ్యాఖ్యానించింది.
ఈమేరకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన సుప్రీం ధర్మాసనం బుధవారం ఈ తీర్పును వెలువరించింది. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ కంపెనీ గతేడాది అదానీ గ్రూపుపై భారీ ఆరోపణలు చేసింది. ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఓ నివేదిక వెలువరించింది. ఈ నివేదిక తీవ్ర దుమారానికి దారితీసింది. దీనిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) విచారణ చేపట్టింది. అయితే, ఈ వ్యవహారంలో సెబీ దర్యాఫ్తు సరిపోదని, సిట్ విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించి బుధవారం తీర్పు వెలువరించింది.