ICU: పేషెంట్ నిరాకరిస్తే ఐసీయూలో చేర్చుకోవడానికి వీల్లేదు.. కేంద్రం ఆదేశాలు
- ఐసీయూలో రోగులను చేర్చుకోవడంపై కీలక మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం
- 24 మంది నిపుణుల బృందం రూపొందించిన మార్గదర్శకాల విడుదల
- ఐసీయూలో చేర్చుకోవాల్సిన రోగులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
రోగి నిరాకరిస్తే ఆసుపత్రి యాజమాన్యాలు ఐసీయూలో చేర్చుకోవడానికి వీల్లేదని కేంద్రం స్పష్టం చేసింది. పేషెంట్ బంధువులు అభ్యంతరం తెలిపినా పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని తెలిపింది. ఈ మేరకు ఐసీయూలో రోగులను చేర్చుకోవడంపై కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. 24 మంది నిపుణుల బృందం ఈ మార్గదర్శకాలను రూపొందించినట్టు తెలిపింది.
ఐసీయూ మార్గదర్శకాల్లోని కీలక పాయింట్లు ఇవే..
- ఐసీయూ చికిత్స వద్దనుకునేవారు ‘లివింగ్ విల్’ను రాతపూర్వకంగా తెలియజేస్తే ఆ విభాగంలో చేర్చుకోకూడదు.
- వ్యాధి లేదా అనారోగ్యంతో మరణం అంచులకు చేరినవారి ఆరోగ్యం ఏ మాత్రం మెరుగుపడే అవకాశం లేనప్పుడు వారిని ఐసీయూల్లో ఉంచడం ఉపయోగం లేదు.
- ఐసీయూ కోసం ఎదురుచూస్తున్న రోగుల రక్తపోటు, శ్వాస రేటు, హృదయ స్పందన, శ్వాస తీరు, ఆక్సిజన్ శాచురేషన్, మూత్ర పరిమాణం, నాడీ వ్యవస్థ పనితీరు వంటి అంశాలను పరిశీలించి ఐసీయూలో చేర్చుకోవడంపై నిర్ణయం తీసుకోవాలి.
- గుండె లేదా శ్వాసకోశ వ్యవస్థ పనితీరులో సమస్యలు ఉన్న రోగులను ఐసీయూల్లో చేర్చుకోవడానికి కారణాలుగా పరిగణించాలి.
- తీవ్ర అనారోగ్యం కారణంగా నిశిత పర్యవేక్షణ అవసరమైన రోగులు, అవయవ వైఫల్యం, ఆరోగ్య పరిస్థితి క్షీణించే అవకాశమున్న వ్యాధులతో బాధపడేవారిని ఐసీయూల్లో చేర్చుకోవాలి.
- మహమ్మారులు, విపత్తుల సమయంలో వనరుల పరిమితి ఆధారంగా రోగులను ఐసీయూల్లో ఉంచే అంశంపై నిర్ణయం తీసుకోవాలి.