Punjab: పంజాబ్‌లో డీఎస్పీ హత్య?
- జలంధర్‌కు సమీపంలో రోడ్డు పక్కన మృతదేహం గుర్తింపు
- కొన్ని రోజుల క్రితం ఓ గ్రామానికి చెందిన వ్యక్తులతో ఘర్షణ నేపథ్యంలో హత్యపై అనుమానాలు
- సీసీ ఫుటేజీలను పరిశీలించి దర్యాప్తు చేస్తామన్న అధికారులు
పంజాబ్ ఆర్మ్‌డ్ పోలీస్ డీఎస్పీ బల్బీర్ సింగ్ అనుమానాస్పద పరిస్థితులలో చనిపోవడం కలకలం రేపుతోంది. జలంధర్‌కు సమీపంలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. కొన్ని రోజుల క్రితం ఓ గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులతో గొడవ పడిన నేపథ్యంలో డీఎస్పీ హత్యకు గురయ్యారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోడ్డు పక్కన మృతదేహం ఉందంటూ తమకు సమాచారం అందిందని, సంగ్రూర్‌లో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ బల్బీర్ సింగ్‌గా గుర్తించామని ఏడీసీపీ బల్వీందర్ సింగ్ రంధవా వెల్లడించారు. తలపై తీవ్రమైన గాయం ఉందని, ఒక కాలు నుజ్జునుజ్జు అయినట్టు గుర్తించామని వివరించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని అధికారి తెలిపారు.
కాగా తన గ్రామానికి వెళ్లే మార్గంలో బల్బీర్ సింగ్ మృతదేహాన్ని గుర్తించామని, తన స్వగ్రామానికి 8 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగిందని ఏడీసీపీ బల్వీందర్ సింగ్ రంధవా తెలిపారు. సింగ్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని చెప్పారు. కొంతకాలం క్రితం జలంధర్‌కు సమీపంలోని ఒక గ్రామానికి చెందిన కొంతమందితో బల్బీర్ సింగ్ గొడవ పడ్డారని, తన లైసెన్స్ రివాల్వర్‌తో ఒక వ్యక్తిని డీఎస్పీ కాల్చారని మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. అయితే ఈ వివాదాన్ని పరిష్కరించుకున్నారని తెలుస్తోంది. గత నెలలో జలంధర్‌లో వేరే ప్రాంతానికి చెందిన కొంతమందితో డీఎస్పీ గొడవ పడ్డారని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇరువర్గాల మధ్య రాజీ కుదరడంతో కేసు నమోదు కాలేదని వెల్లడించారు. ఇదిలావుంచితే డీఎస్పీ ఉద్యోగం మొదలుపెట్టడానికి ముందు బల్బీర్ సింగ్ వెయిట్ లిఫ్టర్‌గా ప్రతిభ చాటారు. 2000లో ఆయనను అర్జున అవార్డు వరించింది.