Manipur: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. నలుగురి మృతి

Violence breaks out again in Manipur and 4 Shot Dead

  • తౌబాల్ జిల్లాలో స్థానికులపై కాల్పులకు తెగబడ్డ దుండగుల సమూహం
  • దోపిడీ కోసం వచ్చారంటున్న స్థానికులు
  • దుండగుల వాహనాలకు నిప్పు పెట్టడంతో చెలరేగిన హింస
  • 5 జిల్లాల్లో తిరిగి కర్ఫ్యూ విధించిన అధికారులు
  • ఘటనపై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన సీఎం బీరెన్ సింగ్

మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. నూతన సంవత్సరం తొలి రోజున ఒక దుండగుల సమూహం జరిపిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తౌబాల్ జిల్లాలోని లిలాంగ్‌లో ఈ ఘటన జరిగింది. దాడికి పాల్పడ్డ దుండగుల వాహనాలకు స్థానికులు నిప్పు పెట్టడంతో అక్కడ హింస చెలరేగింది. దీంతో రాష్ట్రంలోని ఐదు లోయ జిల్లాల్లో తిరిగి కర్ఫ్యూను విధించాల్సి వచ్చింది. తౌబాల్, ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, కక్చింగ్, బిష్ణుపూర్ జిల్లాల్లో కర్ఫ్యూను విధించినట్లు అధికారులు తెలిపారు. కొందరు వ్యక్తులు ఆటోమేటిక్ ఆయుధాలతో కాల్పలు జరిపారని, దోపిడీ కోసం వచ్చి ఈ దారుణానికి తెగబడ్డారని స్థానికులు చెబుతున్నారు. దుండగుల సమూహం ఓ స్థానిక వ్యక్తితో మాట్లాడుతుండగా వారి మధ్య గొడవ జరిగిందని, కొద్దిసేపటికి అందరిపై కాల్పులు జరిపారని ఓ వ్యక్తి వెల్లడించారు.

ఈ హింసాత్మక ఘటనపై మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ స్పందించారు. హింసాత్మక ఘటనను ఆయన ఖండించారు. శాంతిని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అమాయక ప్రజల ప్రాణాలు తీయడం పట్ల విచారం వ్యక్తం చేశారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయన్నారు. నేరస్థులను గుర్తించేందుకు ప్రభుత్వానికి సహాయం చేయాలంటూ లిలాంగ్ ప్రజలను ఆయన కోరారు.

ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో పరిస్థితులు మెరుగవుతున్న వేళ జరిగిన ఈ హింసాత్మక ఘటనపై మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం బీరెన్ సింగ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాగా గతేడాది మే 3న మణిపూర్‌లో చెలరేగిన హింస 2023లో జరిగిన ముఖ్య ఘటనల్లో ఒకటిగా నిలిచిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో చోటుచేసుకున్న తీవ్ర హింసలో 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, సుమారు 60,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

Manipur
Violence
Biren Singh
Thoubal district
Guwahati
  • Loading...

More Telugu News